Telangana BJP Bhim Deeksha: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR).. భారత రాజ్యంగంపై చేసిన వ్యాఖ్యల అనంతరం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంపై దశలవారీగా ఉద్యమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సైతం చేస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) ఈ రోజు (గురువారం) ఢిల్లీలో మౌన దీక్ష చేపట్టనున్నారు. బీజేపీ భీమ్ దీక్ష పేరుతో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపనున్నారు. ఉదయం 11.00 గంటల నుంచి రాజ్ ఘాట్ వద్ద ఈ నిరసన కార్యక్రమం ప్రారంభంకానుంది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న బండి సంజయ్ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఈ దీక్షకు ఉపక్రమించారు. బండి సంజయ్‌తో పాటు ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాబూరావు, పలువురు కేంద్ర మంత్రులు, తెలంగాణ నాయకులు ఈ దీక్షలో పాల్గొననున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో కూడా భీం దీక్షలు చేపట్టనున్నట్లు తెలంగాణ బీజేపీ తెలిపింది.
పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం దీనిపై మాట్లాడిన సీఎం కేసీఆర్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఇప్పటికే బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా బీజేపీ పలు కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రణాళికలు చేసింది. అయితే ఈ దీక్ష ద్వారా కేసీఆర్‌ను రాజ్యాంగ ద్రోహిగా దేశల ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా సీఎం కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఈ అంశంపై పోరాడాలని వ్యూహం రచిస్తోంది.
Also Read: