Telangana: తెలంగాణలో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు.. ఎన్ని వేల కోట్లంటే?

|

Jan 18, 2024 | 7:21 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటన సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సుకు వెళ్లిన తెలంగాణ సీఎం.. ప్రముఖ కంపెనీలతో అనేక కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అదానీ, టాటా, జేఎస్‌డబ్ల్యూ, గోద్రెజ్, గోది, వెబ్‌ వర్క్స్‌, ఆరాజెన్‌ లాంటి దిగ్గజ కంపెనీలు ఇందులో ఉన్నాయి. దాంతో, తెలంగాణకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి.

Telangana: తెలంగాణలో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు.. ఎన్ని వేల కోట్లంటే?
Revanth Reddy, Natarajan Chandrasekaran, Sridhar Babu
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటన సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సుకు వెళ్లిన తెలంగాణ సీఎం.. ప్రముఖ కంపెనీలతో అనేక కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అదానీ, టాటా, జేఎస్‌డబ్ల్యూ, గోద్రెజ్, గోది, వెబ్‌ వర్క్స్‌, ఆరాజెన్‌ లాంటి దిగ్గజ కంపెనీలు ఇందులో ఉన్నాయి. దాంతో, తెలంగాణకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి.

ఇందులో భాగంగా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది భారత్ పారిశ్రామిక దిగ్గజం టాటా. రాష్ట్రంలోని 50 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల (స్కిల్లింగ్ సెంటర్లు) ఏర్పాటుకు టాటా గ్రూప్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. వీటిలో కొత్త కోర్సులు, మాస్టర్ ట్రైనర్ల నియామకానికి రూ.1500 కోట్ల పెట్టబడులు పెట్టనుంది. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇప్పటికే వివిధ రంగాల్లో విస్తరించిన టాటా గ్రూప్ తెలంగాణలో చేపట్టబోయే భవిష్యత్తు వ్యాపార ప్రణాళికలపై చర్చించారు.

ఐటీ రంగంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) హైదరాబాద్ లోని అతి పెద్ద ఐటీ కంపెనీలలో ఒకటి. ఇందులో 80 వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. రాబోయే కొన్నేళ్లలో టీసీఎస్ మరింత వృద్ధి చెందనుంది. టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఇప్పటికే గ్లోబల్ డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో పలు ప్రాజెక్టులు చేపట్టింది. బోయింగ్, సికోర్స్ కీ, జిఇ, లాక్‌హీడ్ మార్టిన్ వంటి కంపెనీలతో కలిసి పెట్టుబడులు పెట్టింది.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేసేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (TTL) ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కొత్త ప్రాజెక్టు చేపడుతోంది. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాన్నితగ్గించే బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తుంది. కొత్త కోర్సులకు పెట్టుబడులు పెడుతుంది. టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఇండియా విస్తరణలోనూ హైదరాబాద్ ను ట్రాన్సిట్ హబ్‌గా ఎంచుకోనుంది. హైదరాబాద్ నుంచి డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాల కనెక్టివిటీని పెంచనుంది.

తెలంగాణ అభివృద్ధికి టాటా గ్రూప్ కీలకమైన భాగస్వామ్యం అందిస్తోందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అన్నారు. వివిధ రంగాలలో పెట్టబడులు పెడుతున్న టాటా గ్రూప్ నకు తగిన సహకారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ ఐటీఐలలో అధునాతన నైపుణ్య కేంద్రాల ఏర్పాటుకు టీటీఎల్ భాగస్వామ్యం పంచుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పేందుకు చొరవ చూపాలని సీఎం టాటా గ్రూప్ ను స్వాగతించారు.

తమ గ్రూప్ పెట్టుబడులకు తెలంగాణ వ్యూహత్మకమైన కేంద్రంగా ఉందని, వీలైనంత మేరకు రాష్ట్రంలో తమ గ్రూప్ వ్యాపారాలను రాష్ట్రంలో విస్తరిస్తామని టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ అన్నారు. కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేయాలనే ఆసక్తితో ఎదురు చూస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం. ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో పెట్టుబడులకు క్యూ సెంట్రియో ఆసక్తి

ఐటీ డెవెలప్ మెంట్, సర్వీసెస్ అందించే క్యూ సెంట్రియో (QCENTRIO) కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సులో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కంపెనీ ప్రతినిధి ఎలమర్తి సమావేశమయ్యారు. ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, ఆటోమోటివ్, అగ్రికల్చర్ మరియు ఇంజినీరింగ్ వంటి రంగాలలో అత్యాధునిక ఐటీ సేవలు అందించటంతో ఈ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.

అమెరికా, ఆసియా పసిఫిక్ రీజియన్లో ఇప్పటికే కార్యకలాపాలను విస్తరించింది. అర్టిఫియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ప్రాసెస్ అటోమేషన్, మెషిన్ లర్నింగ్, బ్లాక్ చైన్ సొల్యూషన్ వరకు వివిధ అధునాతన సాంకేతిక సేవలను ఈ సంస్థ అందిస్తోంది. కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ పరిధిలో దాదాపు 1000 ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా ఎంచుకుంది. వ్యాపార అవకాశాలు, పర్యావరణ అనుకూలతలున్నందున హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఈ సంస్థ ఆసక్తిని ప్రదర్శించింది. తగిన సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఐటీ రంగంలో మూడు దశాబ్దాలుగా తమ కంపెనీ ఎన్నో విజయాలు సాధించిందని Qcentrio సారథ్యం వహించి యలమర్తి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి, శ్రేయస్సులో తమ కంపెనీ భాగస్వామ్యం పంచుకుంటుందని అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…