
అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు.. ప్రభుత్వ శాఖల్లో కొందరు అధికారులు లంచం కోసం పేద ప్రజలను పట్టి పీడిస్తున్నారు.. అన్ని సక్రమంగా ఉన్న కూడా పైస ఇవ్వనిదే పని చేయరు. ఇక పైసలు ఇస్తే చాలు ఏ పనైనా క్షణాల్లో పూర్తి చేస్తున్నారు.. ఒక వైపు ఏసీబీ అధికారులు దాడులు జరుగుతూనే ఉన్నాయి.. లంచం తీసుకునే దొంగలు దొరికిపోతూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా కొంతమంది అధికారులు మాత్రం అసలు భయపడకుండా లంచాలు తీసుకుంటూనే ఉన్నారు.. తాజాగా సిద్దిపేట జిల్లాలో ఓ తహసిల్దార్ ఏసీబీ అధికారులకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఓ భూ సమస్య పరిష్కారం కోసం వచ్చిన ఓ బాధితుడిని వేధించి, లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి నుంచి 70 వేల రూపాయల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేసి అదుపులోకి తీసుకున్నారు. చేర్యాల తహసీల్దార్‌గా పనిచేస్తున్న కొర్ర దిలీప్ నాయక్ తన కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కడం జిల్లాలో సంచలనంగా మారింది.
నాగాపురి గ్రామానికి చెందిన ఓ బాధితుడు తన భూమికి సంబంధించిన నాలా కన్వర్షన్ కోసం చాలా రోజులుగా చేర్యాల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. మొత్తం 11 నాలా దరఖాస్తులను క్లియర్ చేసేందుకు గాను తహసీల్దార్ దిలీప్ నాయక్, బాధితుడిని ఏకంగా 70 వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు వెంటనే మెదక్ రేంజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీనితో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ముందస్తు ప్లాన్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం ప్రాంతంలో చేర్యాల తహసీల్దార్ కార్యాలయం పై మెరుపు దాడులు చేశారు. బాధితుడి నుంచి తహసీల్దార్ దిలీప్ నాయక్ 70,000 నగదును తీసుకుంటుండగా.. ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తహసీల్దార్ చేతులకు కెమికల్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఆయన వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..