
మైనర్ బాలికను అపహరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన పోక్సో కేసులో నిందితుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు కఠిన శిక్ష విధించింది. పహాడీషరీఫ్ పోలీసుల పకడ్బందీ దర్యాప్తుతో నిందితుడిపై అభియోగాలు రుజువుకావడంతో, కోర్టు అతడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఐపీసీ సెక్షన్లు 366, 376(2)(i)(n)తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 5(l) రీడ్ విత్ 6 కింద నమోదైన కేసులో ఈ తీర్పు వెలువడింది.
పోలీసుల వివరాల ప్రకారం.. 2020 ఫిబ్రవరి 9న మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలోని దేవేందర్ నగర్ కాలనీకి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలిక ఇంటి నుంచి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, పొరుగున నివసించే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు క్రైమ్ నెంబర్ 70/2020గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో పోలీసులు బాలికను సురక్షితంగా గుర్తించగా, నిందితుడు ఆమెను అపహరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆధారాలతో సహా నిర్ధారించారు. సాక్ష్యాధారాలను సేకరించిన అనంతరం ఐపీసీ, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసును నమోదు చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ సమర్పించిన మౌఖిక, డాక్యుమెంటరీ, శాస్త్రీయ ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చింది.
ఈ కేసులో దర్యాప్తు అధికారులు సమర్పించిన పటిష్టమైన సాక్ష్యాలు, ప్రాసిక్యూషన్ వాదనలు కీలకంగా మారాయి. దర్యాప్తు అధికారులు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ అధికారులు, సమన్స్ అధికారులు, లైజన్ అధికారులు, ట్రయల్‌లో భాగమైన పోలీసు సిబ్బంది సమన్వయంతో కేసు త్వరితగతిన విచారణకు వచ్చి నిందితుడికి శిక్ష పడేలా చేసినందుకు ఉన్నతాధికారులు వారిని అభినందించారు.
పోక్సో కేసుల్లో బాధితుల వివరాలను గోప్యంగా ఉంచడం చట్టబద్ధమైన నిబంధన అని పోలీసులు మరోసారి గుర్తుచేశారు. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఇలాంటి కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు, సమర్థవంతమైన విచారణ ద్వారా నిందితులకు శిక్ష పడేలా చర్యలు కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.