
కొత్త సంవత్సరానికి ఓ మంచి వాతావరణంలో స్వాగతం పలకండి, గలీజు పనుల జోలికి వెళ్లొద్దు, సెలబ్రేషన్స్‌ని ఇల్లీగల్‌గా చేసుకొని కేసుల బారిన పడొద్దు అని కూల్‌కూల్‌గా మెసేజ్ ఇస్తున్నారు ఖాకీలు. కాదూకూడదూ అని రెచ్చిపోతే, కథ కటకటాల్లోకే అని గట్టి వార్నింగూ వినిపిస్తోంది.
మరో వారం రోజుల్లో న్యూఇయర్ జోష్ షురూ. అంబరాన్నంటే సంబరాలే కాదు, ఓవరాక్షన్లు, ఆవారా పనులూ కూడా అప్పుడే. వెర్రెక్కిన కుర్రకారుకు అడ్డూ అదుపూ ఉండదు. పోలీసులకు ఏడాదంతా ఒక ఎత్తయితే, కొత్త సంవత్సర సీజన్ ఒక్కటీ ఒక ఎత్తు. ఎందుకంటే, సెలబ్రేషన్స్ పేరుమీద అక్కడ జరిగే అరాచకాలకు అంతే ఉండదు. అందుకే, ఎక్సైజ్, డ్రగ్ కంట్రోల్, లా అండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్.. అన్ని శాఖలూ ఒక్కటయ్యాయి. ఈగల్ టీములు కూడా ఎటెన్షన్‌లోకొచ్చేశాయి. GHMCతోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్‌కి సిద్ధమైంది ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్.
హైదరాబాద్‌లోని పబ్బులు, ఫామ్ హౌస్‌లపై డేగ కన్నేశారు ఖాకీలు. డ్రగ్స్ అమ్మేవాళ్లతోపాటు వినియోగించేవాళ్లు కూడా దొరికితే లోపలేయడం పక్కా. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీల్లో కనిపించకూడదు. ఇంతేకాదు, పరిమితికి మించి లిక్కర్ వాడినా నేరమే. అటు, నాన్ పెయిడ్ డ్యూటీ లిక్కర్ మీద కూడా ఫోకస్ పెట్టింది ఖాకీ శాఖ.
గంజాయి విక్రయాల్లో స్టూడెంట్స్ కూడా ఉండడంతో కాలేజ్ యాజమాన్యాలు, హాస్టళ్ల ఓనర్స్‌తో మీటింగ్స్ పెట్టి క్లాసులు పీకారు పోలీసులు. ఇటు, ఏపీ, ఒడిషా, మహారాష్ట్ర నుంచి గంజాయి తరలిస్తున్నారన్న వార్తలతో అప్రమత్తమయ్యారు పోలీసులు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టి వాహనాలను ఎక్కడిక్కడే తనిఖీ చేసి పంపిస్తున్నారు. ఈగల్ టీమ్స్, ఎస్‌ఓటీ పోలీసులు కంబైన్డ్ ఆపరేషన్స్ స్పీడప్ చేశారు. నిన్నటికి నిన్న హైదరాబాద్ రాయదుర్గంలో ఐదుగురిని అరెస్ట్ చేసి, 12 గ్రాముల MDMA, 7 గ్రాముల గంజాయి సీజ్ చేశారు. పబ్‌లపై కూడా నిఘా పెంచేశారు. రూల్స్ ఉల్లంఘించిన పబ్‌లపై కేసులు నమోదయ్యాయి.
ఇటీవలే ఆపరేషన్ దూల్‌పేట్ పేరుతో జూలు విదిల్చి, వంద కేసులు నమోదు చేసింది. వరుస తనిఖీలతో డ్రగ్స్ ట్రాఫిక్ నియంత్రణలోకొచ్చి, గంజాయి అమ్మకాలు 90 శాతం తగ్గినట్టు లెక్కుంది. అయినా సరే, న్యూ ఇయర్ వేడుకలను తేలిగ్గా తీసుకోవడం లేదు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..