
నిత్యం జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు పెట్టడమే కాకుండా.. దాని గురించి ప్రశ్నించినందుకు తిరిగి పెత్తనం చలాయిస్తున్నాడు ఇక్కడ ఓ ప్రబుద్ధుడు. నడిరోడ్డుపై అందరి ముందు అసభ్యకరంగా మాట్లాడడంతో పాటు వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. చేసేదే తప్పు.. పైగా దబాయించడం మరో ఎత్తు. ఇలాంటి వారిని ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది కూడా కట్టడి చేయలేకపోతున్నారంటే పరిస్థితి ఏ విధంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఆ దారిలో వెళ్తున్న వాహనదారులకు, ప్రజలతో పాటు ట్రాఫిక్ సిబ్బందికి సైతం ఇది ఒక తలనొప్పిగా మారింది.
హైదరాబాద్ నగరం అంటేనే ఎన్నో ప్రాంతాల ప్రజలకు నిలయం. ఎంతో మంది ఉద్యోగాలు, పనులు అంటూ పొట్ట చేతపట్టుకుని నగరానికి వలస వస్తుంటారు. దాంతో పాటు హైదరాబాద్ నగరం అంటే పర్యాటకులకు అనువైన ప్రదేశం. నగరంలో ఉన్న ఎన్నో పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి, మరెన్నో అందమైన ప్రాంతాలను తమ జ్ఞాపకాలలో పొందుపరుచుకోవడానికి దేశ విదేశాల నుంచి నిత్యం వేలల్లో పర్యాటకులు వస్తూ ఉంటారు. నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో ఎప్పుడూ టూరిస్టులతో హడావుడిగా ఉండే చార్మినార్ పరిసరాల్లో ఓ ఆటో డ్రైవర్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. అసభ్యకరమైన పదాలతో మాట్లాడుతూ ఇష్టానుసారంగా రోడ్లపై ఆటోలు పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నాడు. అడిగితే తన తప్పేం లేదన్నట్లు తిరిగి దబాయిస్తున్నాడు. బూతులు మాట్లాడుతూ చేతితో అసభ్యకరంగా సైగలు చేస్తూ టూరిస్టులతో పాటు మహిళలను తీవ్ర ఇబ్బందులు గురిచేయడం స్థానికంగా కలకలం రేపింది.
రద్దీగా ఉండే రోడ్డుపై ఎందుకు ఆటోని అడ్డంగా నిలిపావని నిలదీసినందుకు అసభ్యకరంగా మాట్లాడడంతో పాటు ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. పైగా ఇదంతా అక్కడివారు కెమెరాలో రికార్డు చేస్తుంటే, నాకేంటి భయం వీడియో తీసుకో అంటూ దబాయించడం మొదలుపెట్టాడు. ఇలాంటి ప్రవర్తనలతో దేశ విదేశాల నుంచి వచ్చే టూరిస్టులలో తప్పుడు అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. చార్మినార్ ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి ఘటనలపై స్పందించకపోవడంతో ఆటో డ్రైవర్లు మరింత రెచ్చిపోతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఆటో డ్రైవర్ ప్రవర్తిస్తున్న తీరు చూస్తే సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుందని.. ఇకనైనా ఇలాంటి వారిని కట్టడి చేసి తగిన చర్యలు తీసుకోవాలని పాతబస్తీ వాసులు ట్రాఫిక్ పోలీస్ శాఖకు విన్నవిస్తున్నారు.