అమ్మంటే …తన రక్తాన్ని చెమటగా మార్చి…. తన చివరి శ్వాస వరకూ తన కుటుంబం కోసం, బిడ్డల కోసం సర్వస్వాన్ని అర్పించి…తను కరిగిపోయే ఓ కొవ్వొత్తి. ఆ కొవ్వొత్తి కరిగిపోయాక లక్షలు ఖర్చుపెట్టి ఓ ఫొటో పెట్టి దండేస్తే…రుణం తీరదని భావించారు మైసూరుకి చెందిన కృష్ణకుమార్. అందుకే జీవితమంతా పిల్లలకోసం పరితపించి… సర్వస్వం త్యాగం చేసిన తల్లికి ఓ అపురూపమైన బహుమతిని అందించాలనుకున్నాడు. మాతృసేవా సంకల్ప యాత్రకు పూనుకున్నాడు. పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలన్న….అమ్మమదిలోని కోర్కెను తీర్చేందుకు సంసిద్ధమయ్యాడు ఈ అభినవ శ్రవణ కుమారుడు. యాత్రలో భాగంగా బుధవారం తల్లీ కొడుకులు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మ వద్దకు చేరుకున్నారు.
మైసూరుకి చెందిన 44ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీరు దక్షిణామూర్తి కృష్ణకుమార్…తన లక్ష రూపాయల జీతాన్ని వదులుకొని, తండ్రి జ్ఞాపకార్థం ఉంచుకున్న స్కూటర్ పై తన తల్లి సూరారత్నమ్మను తీసుకొని.. జనవరి 16, 2018లో మైసూరులో ఈ మాతృసేవా సంకల్ప యాత్రని ప్రారంభించారు. ఇప్పటివరకు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, గోవా, కేరళ, మేఘాలయ, త్రిపుర, మణిపూర్, మిజోరాం, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాలలో పుణ్యక్షేత్రాలను తల్లికి చూపించారు. ఇప్పటివరకు 65412 కిలోమీటర్లు మేర స్కూటర్ పై ప్రయాణించారు తల్లీ కొడుకులు. తల్లి కోరిక నెరవేరుస్తున్న కొడుకుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
తెలంగాణ వార్తల కోసం..