ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా చుట్టుముట్టిన కోతుల గుంపు.. అయ్యో ఎంతపనైంది..

మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళపై ఒక్కసారిగా కోతుల గుంపు దాడి చేయడంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆమె గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోందని, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతుల సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా చుట్టుముట్టిన కోతుల గుంపు.. అయ్యో ఎంతపనైంది..
Monkey Attack

Edited By:

Updated on: Jul 11, 2026 | 3:10 PM

కోతుల గుంపు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కోతుల దాడితో భయాందోళనకు గురైన ఓ మహిళ గుండెపోటుతో అక్కడికక్కడే మరణించింది. ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఒక్కసారిగా కోతులు ముట్టడించడంతో.. ప్రాణాలు కాపాడుకునే క్రమంలో కిందపడి, తీవ్ర భయంతో ఆమె కన్నుమూసింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజీపల్లి గ్రామానికి చెందిన 46 ఏళ్ల పద్మ అనే మహిళ రోజూలాగే ఉదయాన్నే తన ఇంటి ముందు ముగ్గు వేస్తోంది. అంతలోనే ఊహించని ప్రమాదం ముంచుకొచ్చింది. ఎక్కడి నుంచి వచ్చాయో గానీ.. ఒక్కసారిగా కోతుల గుంపు ఆమెపై దాడికి తెగబడ్డాయి. కోతుల గుంపు ఒక్కసారిగా మీదికి రావడంతో పద్మ తీవ్ర భయాందోళనకు గురైంది. వాటి నుంచి తప్పించుకునేందుకు గట్టిగా అరుస్తూ వెనక్కి పరుగులు తీసింది.

ఈ క్రమంలో కంగారులో ఇంటి గడప తగిలి ఒక్కసారిగా కిందపడిపోయింది.. కిందపడినా కోతులు వదలకుండా దాడి చేస్తాయేమోనన్న విపరీతమైన భయంతో ఆమె అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి (స్పృహ తప్పి) వెళ్లిపోయింది. పద్మ స్పృహ తప్పి పడిపోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె పరిస్థితి విషమించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు.. తీవ్రమైన భయాందోళన వల్ల గుండెపోటు వచ్చి పద్మ మరణించిందని ధృవీకరించారు.. కోతుల దాడి, భయంతో నిండు ప్రాణం పోవడంతో అప్పాజీపల్లి గ్రామ ప్రజలకు కన్నీరు మున్నీరవుతున్నారు..

గ్రామాల్లో కోతుల సమస్య నానాటికీ పెచ్చుమీరిపోతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడదను వదిలించడంలో అధికారులు విఫలమయ్యారని, వారి నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఓ నిండు ప్రాణం బలైపోయిందని వాపోతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ, స్థానిక అధికారులు స్పందించి కోతులను పట్టుకోవాలని, గ్రామానికి రక్షణ కల్పించాలని అప్పాజీపల్లి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us