
వినాయక చవితి సందర్భంగా మైక్రో ఆర్టిస్ట్ మట్టెవాడ అజయ్ కుమార్ తన అద్భుతమైన కళా నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. కనురెప్ప వెంట్రుక అంచున నాట్య గణపతి సూక్ష్మ శిల్పాన్ని రూపొందించి, వినాయకుడిపై తన భక్తిని చాటుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అజయ్ కుమార్, సూది రంధ్రాలు, మానవ వెంట్రుకలు, గుండు సూదులు వంటి అతి సూక్ష్మమైన వస్తువులపై శిల్పాలు చెక్కడంలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నారు. ఈసారి ఆయన తన కళకు మరింత కొత్తదనాన్ని జోడించి, కేవలం 0.37 మిల్లీమీటర్ల ఎత్తు ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఒక కనురెప్ప వెంట్రుకపై మలిచారు.
ఈ సూక్ష్మ శిల్పాన్ని మానవ కంటితో చూడటం అసాధ్యం. కేవలం మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే వీక్షించగలరు. ఈ కళాఖండాన్ని రూపొందించడానికి అజయ్ కుమార్ రెండు నెలల పాటు, సుమారు 120 గంటలు కష్టపడ్డారు. ఈ సూక్ష్మ శిల్పాన్ని తయారు చేయడానికి మెత్తని మైనం, ఇసుక రేణువులు, ప్లాస్టిక్ పౌడర్, స్వయంగా తయారు చేసుకున్న సూక్ష్మ పనిముట్లను ఉపయోగించారు. రంగుల కోసం గొంగళి పురుగు వెంట్రుకను వాడటం విశేషం.
బంగారం, ఏనుగు దంతం, అగ్గిపుల్లలు వంటి అరుదైన పదార్థాలతో శిల్పాలు చెక్కడంలో అజయ్ కుమార్ ప్రసిద్ధులు. భారీ వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించే ఈ సమయంలో అత్యంత సూక్ష్మ పరిమాణంలో గణపతి విగ్రహాన్ని తయారు చేసి, తన భక్తి పారవశ్యాన్ని చాటుకున్న అజయ్ కుమార్ కళాకృషి ఎంతో ప్రశంసనీయం.