త్రిబుల్ ధమాకా.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. ఆ ఇంట అంబరాన్ని అంటిన సంబరాలు..

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేటలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. జంగిటి రాజలక్ష్మి–నరేందర్ దంపతులకు తొలి సంతానంగానే ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. ఒక బాబు, ఇద్దరు పాపలు జన్మించగా.. ప్రస్తుతం తల్లి, ముగ్గురు చిన్నారులు క్షేమంగా ఉన్నారు. తక్కువ బరువుతో జన్మించిన శిశువులను పెడియాట్రిషియన్‌ ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు.

త్రిబుల్ ధమాకా.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. ఆ ఇంట అంబరాన్ని అంటిన సంబరాలు..
Triplets

Edited By:

Updated on: Aug 11, 2026 | 5:09 PM

మాములుగా ఇంట్లో ఒక బిడ్డ పుడితేనే ఆ కుటుంబమంతా సంబరంలో మునిగిపోతుంది. అలాంటిది ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలు అయితే.. ఇక ఆ ఆనందానికి పట్టపగ్గాలు ఉంటాయా..?. ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించిన అరుదైన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మొదటి సంతానంగానే ఒకేసారి ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడంతో ఆ కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. పుట్టిన ముగ్గురు చిన్నారుల్లో ఒకరు బాబు కాగా.. ఇద్దరు పాపలు ఉన్నారు. ప్రస్తుతం తల్లి, ముగ్గురు శిశువులు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేట గ్రామానికి చెందిన జంగిటి రాజలక్ష్మి, నరేందర్ దంపతులకు ఇది తొలి సంతానం. రాజలక్ష్మికి ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మెట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు ప్రసవం నిర్వహించగా.. ఒకేసారి ముగ్గురు శిశువులు జన్మించారు.

పుట్టిన ముగ్గురు శిశువుల్లో బాబు 1.8 కిలోలు, మొదటి పాప 1.5 కిలోలు, రెండో పాప 1.4 కిలోల బరువుతో ఉన్నారు. ముగ్గురూ తక్కువ బరువుతో జన్మించడంతో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పిల్లల నిపుణుల  పర్యవేక్షణలో ఉంచి అవసరమైన చికిత్స, వైద్య సేవలు అందిస్తున్నారు. ఒకే ప్రసవంలో ముగ్గురు శిశువులు జన్మించడం అరుదైన విషయమని వైద్యులు చెబుతున్నారు. అందులోనూ వివాహం తర్వాత తొలి సంతానంగానే ముగ్గురు పిల్లలు జన్మించడంతో రాజలక్ష్మి-నరేందర్ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముగ్గురు చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలని కుటుంబ సభ్యులు, బంధువులు ఆకాంక్షిస్తున్నారు.

Kids

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us