
తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో అక్రమ ఫీజుల వసూళ్లపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కఠిన హెచ్చరిక జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల మొత్తం ఫీజును నాలుగున్నర సంవత్సరాలకే పరిమితం చేయాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లుగా వసూలు చేస్తున్నట్లు భావించి అదనపు ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చిరంచింది. కోర్సు వ్యవధి 4.5 సంవత్సరాలే అయినప్పటికీ, విద్యార్థులపై భారం తగ్గించే ఉద్దేశంతో ఫీజును ఐదు విడతలుగా మాత్రమే వసూలు చేయాలని యూనివర్సిటీ సూచించింది.
అయితే, దీనిని తప్పుగా అర్థం చేసుకుని ఐదు సంవత్సరాల ఫీజు పేరుతో అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నారని, ఇది సరైంది కాదని యూనివర్సిటీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అలాగే, ఫెయిల్ అయిన లేదా డిటైన్ అయిన విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయడం, ముందస్తుగా మొత్తం ఫీజులు తీసుకోవడం కూడా నిషేధమని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అనేక ఫిర్యాదులు అందడంతో యూనివర్సిటీ ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా మేనేజ్‌మెంట్ కోటా విద్యార్థుల నుంచి ఐదు సంవత్సరాల ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చినట్లు తెలిపింది. ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అవసరమైతే అనుబంధాన్ని రద్దు చేసే అవకాశముందని పేర్కొంది.
ఇక తెలంగాణ ప్రవేశాలు – ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయించిన ఫీజు నిర్మాణం ప్రకారం.. 9 సెమిస్టర్ల కోర్సుకు 2023–2026 కాలానికి ఫీజులను ఐదు సమాన విడతలుగా విభజించారు. ఉదాహరణకు.. సంవత్సరానికి రూ.14.50 లక్షల ఫీజు ఉంటే, మొత్తం కోర్సు ఫీజు రూ.65.25 లక్షలుగా అంటే నాలుగున్నర సంవత్సరాలకు నిర్ణయించారు. దీన్ని ఐదు విడతలుగా విభజించి ప్రతి ఏడాది రూ.13.05 లక్షల చొప్పున మాత్రమే వసూలు చేయాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని కెరీర్ & ఉద్యోగాలు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..