Telangana: పత్తి చేను నుంచి గుప్పున వాసన.. పోలీసులు వెళ్లి ఏంటా అని చూడగా..
పంట మధ్యలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి దందాపై ఖాకీలు పంజా విసిరారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో పోలీసులు చేపట్టిన మెరుపు దాడుల్లో లక్షల రూపాయల విలువైన గంజాయి మొక్కలు బయటపడ్డాయి. వ్యవసాయం ముసుగులో జరుగుతున్న ఈ చీకటి వ్యాపారం గుట్టును పోలీసులు ఎలా రట్టు చేశారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పంట మాటున గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్న ఇద్దరు రైతుల గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. వ్యవసాయ క్షేత్రాల్లో అంతర పంటగా గంజాయిని పెంచుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించి రూ.3.30 లక్షల విలువైన 33 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన బోథ్ మండల పరిధిలో కలకలం రేపింది. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బోథ్ మండలం పట్నాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ భూముల్లో కొందరు పత్తి పంట మధ్యలో గంజాయి సాగు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో బోథ్ ఎస్ఐ పురుషోత్తం తన సిబ్బందితో కలిసి అక్టోబర్ 24న పట్నాపూర్ శివారులోని చేలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో రెండు వేర్వేరు వ్యవసాయ భూముల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు.
రెండు వేర్వేరు కేసులు
రాములు కొమ్రం అనే వ్యక్తికి చెందిన పత్తి చేనులో పోలీసులు తనిఖీ చేయగా, అంతర పంటగా సాగు చేస్తున్న 17 గంజాయి మొక్కలు బయటపడ్డాయి. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.1.70 లక్షలు ఉంటుందని పోలీసులు నిర్ధారించారు. అదే రోజు సమీపంలోని మరో చేనులో తనిఖీలు చేపట్టగా, సిదం చిట్రు అనే వ్యక్తి సాగు చేస్తున్న 16 గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.1.60 లక్షలుగా ఉంటుందని లెక్కగట్టారు. ఈ రెండు కేసుల్లో కలిపి మొత్తం 33 మొక్కలను పోలీసులు సీజ్ చేసి, ఇద్దరిపై వేర్వేరుగా కేసులు నమోదు చేశారు.
గంజాయి వ్యసనమే సాగుకు కారణం!
రెండో కేసులోని నిందితుడు సిదం చిట్రుకు సంబంధించి పోలీసులు ఆసక్తికర వివరాలు వెల్లడించారు. నిందితుడు తన బంధువుకు చెందిన వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. అయితే అతనికి గంజాయి తాగే అలవాటు ఉండటంతో తాను సేవించిన గంజాయి నుంచి సేకరించిన విత్తనాలను పత్తి చేనులో నాటి మొక్కలుగా పెంచుతున్నట్లు విచారణలో అంగీకరించాడు.
అక్రమ సాగుదారులపై కఠిన చర్యలు: డీఎస్పీ హెచ్చరిక
ఈ సందర్భంగా డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. గంజాయి సాగు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా లేదా వినియోగించినా చట్టరీత్యా కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పంటల మాటున ఇలాంటి అక్రమ సాగుకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాల నివారణకు ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఎవరైనా గంజాయి సాగు లేదా అమ్మకాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
