ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ (Hyderabad) లో ఆదివారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. బేగంబజార్, ఎంజే మార్కెట్, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్‌బాగ్, నాంపల్లి, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లిబర్టీ, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, హెచ్‌ఐసీసీ, నిజాంపేట, ప్రగతినగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, కిస్మత్‌పురా, బండ్లగూడ జాగీర్, హైదర్షాకోట్, గండిపేట్ పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం (Rains) కురిసింది. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా.. రాగల మూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్‌పల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఉపరితల ఆవర్తనం ఝార్ఖండ్ పరిసరాల్లో కొనసాగుతూ సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాగల 24గంటల్లో ఝార్ఖండ్ పరిసరాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. తద్వారా రాగల 24గంటల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.