TGSRTC: రింగ్‌రోడ్డు మీదుగా జిల్లాలకు బస్సులు.. ఆర్టీసీ కీలక నిర్ణయం

|

Sep 30, 2024 | 3:08 PM

ట్రాఫిక్ ర‌ద్దీ నేప‌థ్యంలో ప్ర‌యాణికుల స‌మ‌యాభావం త‌గ్గించేందుకు హైద‌రాబాద్ శివారు ప్రాంతాల నుంచి ద‌స‌రాకు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను నడపాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. సొంతూళ్ల‌కు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీన‌గ‌ర్, ఉప్ప‌ల్, ఆరాంఘ‌ర్, సంతోష్ నగర్, కేపీహెచ్‌బీ, త‌దిత‌ర ప్రాంతాల నుంచి స్పెష‌ల్ స‌ర్వీసులను..

TGSRTC: రింగ్‌రోడ్డు మీదుగా జిల్లాలకు బస్సులు.. ఆర్టీసీ కీలక నిర్ణయం
TGSRTC
Follow us on

దసరాకు సొంతూళ్లకు వెళ్లేందుకు హైదరాబాదీలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు అడ్వా్స్‌ బుకింగ్స్‌ సైతం చేసుకున్నారు. దసరా, బతుకమ్మ పండగల నేపథ్యంలో ఒక్కసారిగా నగరం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పల్లెబాట పడుతుంటారు. దీంతో సహజంగానే ట్రాఫిక్‌ సమస్య ఎదురుకావడం సర్వసాధారణం. సిటీ దాటడానికే దాదాపు 2 గంటలు పట్టడం ఖాయం. అయితే ఈసారి ఈ సమస్యను తగ్గించేందుకు తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

ట్రాఫిక్ ర‌ద్దీ నేప‌థ్యంలో ప్ర‌యాణికుల స‌మ‌యాభావం త‌గ్గించేందుకు హైద‌రాబాద్ శివారు ప్రాంతాల నుంచి ద‌స‌రాకు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను నడపాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. సొంతూళ్ల‌కు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీన‌గ‌ర్, ఉప్ప‌ల్, ఆరాంఘ‌ర్, సంతోష్ నగర్, కేపీహెచ్‌బీ, త‌దిత‌ర ప్రాంతాల నుంచి స్పెష‌ల్ స‌ర్వీసులను అందుబాటులో ఉంచనుంది. ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌక‌ర్యార్థం గ‌చ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజ‌య‌వాడ‌, బెంగ‌ళూరు, త‌దిత‌ర ప్రాంతాల‌కు బ‌స్సుల‌ను నడిపేలా ప్లాన్ చేసింది.

ద‌స‌రా పండుగకు ప్ర‌త్యేక బ‌స్సులు, ర‌ద్దీ ప్రాంతాల్లో ప్ర‌యాణికుల‌కు క‌ల్పించాల్సిన సౌక‌ర్యాల‌పై త‌మ క్షేత్ర స్థాయి అధికారుల‌తో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ వ‌ర్చ్‌వ‌ల్‌గా స‌మావేశ‌మ‌య్యారు. గతేడాదితో పోల్చితే ఈసారి మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు కారణంగా ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశ‌ముంద‌ని అందుకు అనుగుణంగా ర‌ద్దీని బ‌ట్టి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచాలన్నారు.

ఈ పండుగలకు 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు సజ్జనార్‌ తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 15వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించినట్లు చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వివరించారు.

రద్దీ ఎక్కువగా ఉండే.. ఎల్బీన‌గ‌ర్, ఉప్ప‌ల్, ఆరాంఘ‌ర్, కేపీహెచ్‌బీ, సంతోష్ నగర్, త‌దిత‌ర ప్రాంతాల్లో ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం షామియానాలు, కూర్చీలు, తాగునీరు, తదితర మౌలిక సదుపాయాలతో పాటు ప‌బ్లిక్ అడ్ర‌స్ సిస్టంను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ దసరాకు కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో కాలుష్యరహిత కొత్త ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను వినియోగించుకోవాలన్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..