
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీ.. రాష్ట్ర విభజన తర్వాత కొంత బలహీనపడింది. అయినా సరే 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయితే వారంతా బీఆర్ఎస్‌లో చేరడంతో టీడీపీ పూర్తిగా బలహీనపడింది. 2018లో కాంగ్రెస్, వామపక్షాలతో జతకట్టి పోటీ చేసినా బీఆర్ఎస్ ముందు నిలబడలేకపోయింది. 2023 ఎన్నికలను పెద్దగా పట్టించుకోనేలేదు. అలాంటి పార్టీని ఇప్పుడు మళ్లీ పైకి లేపేందుకు… తెలంగాణపై పసుపు జెండా ఎగరేసేందుకు అధిష్టానం ఉవ్విళ్లూరుతోంది. 2024లో ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ మొన్నటి మహానాడు సాక్షిగా బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టిసారిస్తామన్నారు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్. మళ్లీ గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు.
టీడీపీతో పొత్తుపెట్టుకుని ఏపీలో పవర్ షేరింగ్ అందుకున్న జనసేన కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2నే హైదరాబాద్‌లో తెలంగాణ జనసేన నేతలతో ఆ పార్టీ అధినేత పవన్ మీటింగ్ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో పార్టీ నిర్మాణం, జిల్లా స్థాయి కమిటీల బలోపేతం, యువతను ఆకర్షించే కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరి లాంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
కొన్నేళ్లుగా జనసేన ఏపీ రాజకీయాలకే పరిమితం అయినా.. 2024లో ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయ్. దీంతో తెలంగాణలో పార్టీకి కొత్త జీవం పోయాలని పవన్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు.. 2028 అసెంబ్లీ ఎన్నికల కోసం కేడర్‌ను స్ట్రాంగ్ చేయాలనే ఆలోచన జనసేన నాయకత్వంలో ఉన్నట్టు తెలుస్తోంది.
మొత్తంగా… టీడీపీ, జనసేన రెండు పార్టీలు తెలంగాణలో బలోపేతంపై ఫోకస్ పెట్టాయి. మరి ఏపీలోలాగా ఇక్కడ కూడా కలిసి వెళ్తారా…? వచ్చే GHMC ఎన్నికలు, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లోనూ కలిసి నడుస్తారా…? అన్నది చూడాలి.