మీ పిల్లలు చాక్లెట్లు, లాలీపాప్స్ తింటున్నారా? అయితే ఇకపై జాగ్రత్త..! ఎందుకంటే ఆ తియ్యని చాక్లెట్‌లోనే విషం ఉంటుంది. మీరు వింటున్నది నిజమే. చాక్లెట్స్, లాలీపాప్స్‌ను కొందరు కేటుగాళ్లు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్న వాతావరణంలో తయారు చేస్తుండగా పట్టుకున్నా ఎస్ఓటీ పోలీసులు. అంతేకాదు వీటి తయారీ కోసం మురికినీరు, చెడిపోయిన బెల్లం, అపరిశుభ్రంగా ఉండే చక్కెను వాడుతున్నట్లు తేలింది. అమ్మో…చదువుతుంటేనే..వాంతికొచ్చేలా అనిపిస్తున్నా..ఇది పచ్చి నిజం. హైదరాబాద్ సిటీ శివారు పరిసరాల్లో ఉన్న కొన్ని గోదాంలో ఇలాంటి నకిలీ చాక్లెట్లు, లాలీపాప్స్ తయారు చేసి, వాటికి బ్రాండెట్ స్టిక్కర్లను అంటించి, మార్కెట్‌లో విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న సులేమాన్‌నగర్‌లోని ఓ గోదాంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. అక్కడి పరిస్థితులు చూసిన అధికారులే షాకయ్యారు. పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో ఈ చాక్లెట్లను తయారు చేస్తున్నట్లు తేలింది. చాక్లెట్ల తయారికి మురికి నీరు, చెడిపోయిన బెల్లం వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ గోదాం యజమాని అహ్మద్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సులేమాన్‌నగర్‌లో ఎలాంటి అనుమతి లేకుండా అహ్మద్ గత 30 ఏళ్ల నుంచి చాక్లెట్స్, లాలీపాప్స్ తయారు చేస్తున్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఎస్‌వోటీ పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 3 లక్షల విలువైన వస్తువులను సీజ్ చేశారు. అయితే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇలాంటి గోదాంలు ఇంకా ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వాటిని గుర్తించి, చిన్నపిల్లల ప్రాణాలతో ఆటలాడుకుంటున్న కేటుగాళ్లను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు జనం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం