
హైదరాబాద్: బహిరంగ రహదారులపై ప్రాణాపాయం కలిగించే విధంగా బైక్ స్టంట్లు చేస్తూ, మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ఆరుగురు నిందితులను రాజేంద్రనగర్ జోన్ టాస్క్ ఫోర్స్, అత్తాపూర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ మధ్య ప్రధాన రహదారులపై కొందరు యువకులు ద్విచక్ర వాహనాలతో ప్రమాదకర విన్యాసాలు (స్టంట్లు) చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. వీరు కేవలం తమ ప్రాణాలనే కాకుండా, పాదచారుల, ఇతర వాహనదారుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్, జిగ్-జాగ్ డ్రైవింగ్, వీలీలు వంటి స్టంట్లు చేస్తూ వాహనాల నుంచి నిప్పురవ్వలు వచ్చేలా రాపిడి చేస్తూ వీరంగం సృష్టిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు అత్తాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించిన పోలీసులు.. ఈ ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నేరానికి ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలను, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ ఆపరేషన్ నిర్వహించిన డిసిపి వైభవ్ గైక్వాడ్ (టాస్క్ ఫోర్స్), రాజేంద్రనగర్ టాస్క్ ఫోర్స్, అత్తాపూర్ పోలీసు బృందాలను అభినందించారు.
తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలను నిశితంగా గమనిస్తూ ఉండాలని, చట్టవిరుద్ధమైన, ప్రాణాపాయం కలిగించే ఇటువంటి పనులకు దూరంగా ఉండేలా కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులు సూచించారు. రహదారులపై ఎక్కడైనా ప్రమాదకర డ్రైవింగ్ లేదా బైక్ స్టంట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరడమైనది.
బైక్ స్టంట్స్ వీడియో..