Hyderabad: కాసుల కోసం కంత్రీ స్కెచ్ వేశారు.. కానీ భలే చిక్కారు..

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అవుట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్‌లో లంచం వ్యవహారం బట్టబయలైంది. కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామని బెదిరించి రూ.2 లక్షలు డిమాండ్ చేసిన ఇద్దరు పోలీస్ అధికారులు ACB ట్రాప్‌లో చిక్కారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్, సబ్‌ఇన్‌స్పెక్టర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం కలకలం రేపింది.

Hyderabad: కాసుల కోసం కంత్రీ స్కెచ్ వేశారు.. కానీ భలే చిక్కారు..
CI Kanakaiah

Edited By:

Updated on: Apr 08, 2026 | 1:31 PM

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అవుట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకుంటూ ఇద్దరు పోలీస్ అధికారులు అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కనకయ్య, సబ్‌ఇన్‌స్పెక్టర్ సిద్ధేశ్వర్‌లను బుధవారం అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో నమోదైన నకిలీ విద్యా సర్టిఫికెట్ల కేసుతో ఈ వ్యవహారం సంబంధం ఉంది. ఆ కేసులో ప్రధాన నిందితుడు ఇప్పటికే జైలులో ఉన్నాడు. అయితే, అతని కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామని బెదిరిస్తూ… వారిని విడిచిపెట్టేందుకు రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చర్చల అనంతరం ఈ మొత్తాన్ని రూ.2 లక్షలకు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు ACB అధికారులు రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్ పర్యవేక్షణలో ట్రాప్ ఏర్పాటు చేసి… లంచం స్వీకరిస్తున్న సమయంలో ఇద్దరు అధికారులను పట్టుకున్నారు. ఈ ఘటన అనంతరం ACB బృందాలు ఎయిర్‌పోర్ట్ అవుట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్‌లో సుమారు ఐదు గంటల పాటు సోదాలు నిర్వహించాయి. పట్టుబడిన అధికారులను నాంపల్లిలోని ప్రత్యేక ACB కోర్టులో హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. తెలంగాణలో ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే, మీరు అవినీతి నిరోధక శాఖ కి ఫిర్యాదు చేయవచ్చు. టోల్-ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేయడం లేదా 9440446106 కు వాట్సాప్/సందేశం పంపడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారు వివరాలు గోప్యంగా ఉంచుతారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us