Vande Bharat: ఇకపై ఆరున్నర గంటలే.! తెలంగాణకు మరో వందేభారత్.. టైమింగ్స్ ఇలా.!!

|

May 27, 2023 | 9:06 AM

తెలంగాణకు త్వరలోనే మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాబోతోంది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. ఇప్పటికే..

Vande Bharat: ఇకపై ఆరున్నర గంటలే.! తెలంగాణకు మరో వందేభారత్.. టైమింగ్స్ ఇలా.!!
Vande Bharat Express
Follow us on

తెలంగాణకు త్వరలోనే మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాబోతోంది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వేకు మూడు వందేభారత్ రైళ్లను భారతీయ రైల్వే శాఖ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇందులో ఒకటి సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య జనవరిలో ప్రారంభం కాగా, మరొకటి సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఏప్రిల్‌లో పట్టాలెక్కింది. మూడోది సికింద్రాబాద్-పూణే మధ్య ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అంతకంటే ముందే నాగ్‌పూర్‌కు ఇది అనుసంధానం కానుంది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య వాణిజ్య సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు నగరాల మధ్య వందేభారత్ రైలును నడిపేందుకు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

నాగ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య 581 కి.మీ. దూరం ఉండగా.. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 11 గంటలుగా ఉంది. ఈ ప్రయాణ సమయాన్ని తగ్గిస్తే రెండు నగరాల మధ్య వ్యాపార సంబంధాలు మరింత దృడంగా మారుతాయని మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుదీర్ ముంగంటివార్ ఇటీవల రైల్వేశాఖ మంత్రిని కలిసి.. వందేభారత్‌ను కోరారు. ఇక ఈ రైలుకు సంబంధించిన తాత్కాలిక టైం టేబుల్‌ను రైల్వే అధికారులు రూపొందించారు. దాని ప్రకారం ఈ వందేభారత్ నాగ్‌పూర్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:30కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1:30కు సికింద్రాబాద్‌లో బయలుదేరి రాత్రి 8 గంటలకు నాగ్‌పూర్‌ చేరుతుంది.

ఈ రైలు వారంలో 6 రోజులు తిరగనుంది. బల్లార్షా, సిర్పూర్, కాగజ్‌నగర్, రామగుండం, కాజీపేటల్లో ఆగనుంది. ఇక ఈ వందేభారత్‌లో ఏసీ చైర్ క్లాస్ టికెట్ రూ.1,450– రూ.1,550, ఎగ్జిక్యూటివ్‌ చైర్ కార్ టికెట్ రూ.2,750–రూ.2,850గా ఖరారు చేసే అవకాశం ఉందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.