
ఎండాకాలం వచ్చిందంటే చాలూ హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడుతుంది. ఈ క్రమంలో వాటర్ ట్యాంకర్‌లకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. మార్చి 2025లో సుమారు 2.1 లక్షల ట్యాంకర్లు బుక్ చేయగా, ఈ ఏడాది ఆ సంఖ్య 2.24 లక్షలకు చేరింది. ప్రస్తుతం రోజుకు సగటున 7,500 బుకింగ్స్ నమోదవుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, వాటర్ బోర్డు ట్యాంకర్ల సరఫరాను వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టింది.
బుకింగ్ చేసిన 12 గంటల్లోనే ట్యాంకర్ పంపించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అయితే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం డిమాండ్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మణికొండ, బంజారాహిల్స్, హఫీజ్‌పేట్, నేటాజీ పార్క్ ఫిల్లింగ్ స్టేషన్ల పరిధిలో నీటి కొరత తీవ్రంగా ఉండడంతో ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. పెండింగ్ బుకింగ్స్‌ను త్వరగా క్లియర్ చేయడానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతాల నుంచి ఎక్కువ అవసరం ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్లను మళ్లిస్తూ పంపిణీని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
అదనంగా నైట్ షిఫ్ట్‌లను పెంచి, అవసరమైతే సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా సూచించారు.ఇక నీటి వినియోగంపై కూడా అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా గృహాల్లో నీటిని బాధ్యతగా వినియోగించాలని, కనీసం 20 శాతం వరకు వినియోగాన్ని తగ్గించాలని సూచించారు, లీకేజీలు వెంటనే సరిచేయడం వంటి చిన్నచిన్న చర్యల ద్వారా నీటిని ఆదా చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.