AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో తాగునీటికి అంతరాయం.. ఈ ప్రాంతాల ప్రజలు అలర్ట్‌గా ఉండండి!

హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్‌ రోడ్డులో కారు ఢీకొనడంతో కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్‌-2 పైప్‌లైన్‌ ఎయిర్‌ వాల్వ్‌ వ్యవస్థ దెబ్బతింది. దీంతో భారీగా నీరు లీకై, పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనుంది. మరమ్మతు పనులను జలమండలి అత్యవసరంగా చేపట్టింది. ప్రభావిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్‌లో తాగునీటికి అంతరాయం.. ఈ ప్రాంతాల ప్రజలు అలర్ట్‌గా ఉండండి!
Car Crashes Into Water Pipeline
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Oct 20, 2026 | 7:59 AM

Share

అసలే ఎల్‌నినో.. ప్రభుత్వం నీటిని వృథా చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్న సమయంలో.. అనుకోని ఘటనతో భారీగా నీటి వృథా అవుతోంది. ఉప్పల్‌- నాగోల్‌ రోడ్డులో ఓ కారు బీభత్సం సృష్టించింది. వాటర్‌పైప్‌లైన్‌ను కారు బలంగా ఢీకొట్టడంతో పైప్‌లైన్ దెబ్బతింది.. దీంతో నీరు భారీగా ఎగసి పడ్డాయి.. కొన్ని గంటలపాటు నీరు వృథాగా పోయాయి.. ఈ ఘటనలో డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి మృతి చెందాడు.. పైప్‌లైన్ పగిలి వృధాగా నీరు పోతూ.. రోడ్డుపైకి రావడంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ఈ ప్రమాదంతో ఉప్పల్‌-నాగోల్‌లోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా ఆగిపోయింది. ఈ మేరకు జలమండలి కీలక ప్రకటన చేసింది. పైప్‌లైన్ పునరుద్ధరణకు జలమండలి అత్యవసర చర్యలు చేపట్టినట్లు తెలిపింది.

‘‘హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్‌-2కు సంబంధించిన పైప్‌లైన్ ఉప్పల్ బాగాయత్ సమీపంలోని నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 813 వద్ద ప్రమాదవశాత్తు దెబ్బతింది. ఈ ప్రాంతంలో ఓ కారు పైప్‌లైన్‌కు సంబంధించిన ఎయిర్ వాల్వ్‌ల వ్యవస్థను బలంగా ఢీకొనడంతో అవి దెబ్బతిని నీటి లీకేజీ ఏర్పడింది. ఈ ఘటన నేపథ్యంలో దెబ్బతిన్న ఎయిర్ వాల్వ్‌లను మరమ్మతు చేయడంతో పాటు అవసరమైన పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు జలమండలి అత్యవసర చర్యలు చేపడుతోంది. ఈ పనుల కారణంగా కృష్ణా ఫేజ్‌-2 సరఫరా వ్యవస్థ పరిధిలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు తాత్కాలిక అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది..’’ అని జలమండలి అధికారులు తెలిపారు.

తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, బీరప్పగడ్డ, రామంతాపూర్, ఉప్పల్, ప్రకాశ్‌నగర్, మేకలమండి, పద్మారావునగర్, బేగంపేట, సౌత్ సెంట్రల్ రైల్వే, ఎంఈఎస్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, లాలాగూడ, అడ్డగుట్ట,, నల్లగుట్ట, మెట్టుగూడ, వైశాలినగర్, మీర్‌పేట, బడంగ్‌పేట, ఏఆర్‌సీఐ, బాలాపూర్, మైసారం, మారేడపల్లి..

వీడియో చూడండి..

ఈ భారీ లీకేజీలను అరికట్టడానికి జలమండలి అధికారులు అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టారు. దీనికి కార‌ణంగా న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయాలు ఏర్పడ‌తాయి. ప‌నులు పూర్తి కాగానే య‌ధావిధిగా నీటి స‌ర‌ఫ‌రా పున‌రుద్ధర‌ణ జ‌రుగుతుందని అధికారులు తెలిపారు..

జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మరమ్మతుల పనులపై తాజా పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్స్‌ అండ్ మెయింటెనెన్స్‌, ట్రాన్స్‌మిషన్‌ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఎండీ అధికారులను ఆదేశించారు.

లీకేజీ వల్ల నీటి సరఫరాలో అంతరాయం కలిగిన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగడకుండా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు. సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఎండీ అధికారులను ఆదేశించారు.

అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదం కారణంగా తాగునీటి సరఫరాలో ఏర్పడే తాత్కాలిక అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని, సంబంధిత ప్రాంతాల వినియోగదారులు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు సహకరించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.

Follow Us