Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ స్టీల్ బ్రిడ్జి.. నాలుగు లైన్లతో నిర్మాణం.. ఎక్కడంటే..?
హైదరాబాద్ ప్రజలకు భారీ గుడ్ న్యూస్ అందింది. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మరో భారీ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం ముందుడుగు వేసింది. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో స్టీల్ బ్రిడ్జిలు ఉండగా.. ఇప్పుడు మరో ప్రాంతంలో నిర్మించేందుకు లైన్ క్లియర్ అయింది.

జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లను నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లను అందుబాటులోకి తీసుకురాగా.. మరికొన్ని నిర్మాణ దశలో కొనసాగుతున్నాయి. మరికొన్ని ఫ్లైఓవర్ల నిర్మాణాలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ ఫ్లైఓవర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వీటి వల్ల సిగ్నల్ ఫ్రీ సౌకర్యం వల్ల వాహనదారులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వేగంగా వెళ్లవచ్చు. హైదరాబాద్ జనాభా రోజురోజుకి పెరిగిపోతున్న క్రమంలో వాహనాల సంఖ్య పెరుగుతోంది. దీంతో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు జీహెచ్‌ఎంసీ భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ముందుగానే ఫ్లైఓవర్ల నిర్మాణానికి అడుగులు వస్తోంది. తాజాగా మరో కీలకమైన ప్రాంతంలో భారీ స్టీల్ ఆర్‌ఓబీ ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది.
లింగంపల్లిలో 4 లైన్ల భారీ స్టీల్ బ్రిడ్జి
లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నాలుగు లైన్ల భారీ స్టీల్ రోడ్ ఓవర్ బ్రిడ్జి( ఆర్‌ఓబీ) నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గుల్మోహర్ జంక్షన్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు 2 కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉంటుంది. మార్గం మధ్యలో జంక్షన్లను కూడా అభివృద్ది చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.308 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ స్టీల్ ఆర్‌ఓబీ వల్ల గచ్చిబౌలి నుంచి బీహెచ్ఈఎల్ వెళ్లే వాహనదారులకు ఊరట కలగనుంది. తెల్లాపూర్, నల్లగండ్ల, గచ్చిబౌలి ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. నల్లగండ్ల ఆర్‌ఓబీపై ఒత్తిడి తగ్గడంతో పాటు లింగంపల్లి అండర్‌పాస్‌పై ఒత్తిడి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. కాంక్రీట్‌తో నిర్మాణం చేపట్టాలంటే ఎక్కువ సమయం పడుతుంది. దీంతో స్టీల్‌తో నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. దీని వల్ల నిర్మాణం వేగంగా పూర్తవుతుందని చెబుతున్నారు.
రెండు లైన్లతో అప్‌ర్యాంప్ నిర్మాణం
ఈ ప్రాజెక్టులో భాగంగా గుల్మోహర్ జంక్షన్ నుంచి రెండు లైన్ల అప్‌ర్యాంప్ నిర్మాణం చేపట్టనున్నారు. అటు శేరిలింగంపల్లి ఆర్‌ఓబీ నుంచి బీహెచ్ఈఎల్ వైపు తరానగర్ వద్ద ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఏర్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిని చెక్ పెట్టేందుకు ప్రస్తుతం 80 అడుగులు ఉన్న రోడ్లను 100 అడుగులకు విస్తరించేందుకు సిద్దమయ్యారు. గచ్చిబౌలి నుంచి వచ్చే 2 లైన్ల అప్‌ర్యాంప్‌లను కూడా పొడిగించనున్నారు. ఇటీవల తెల్లాపూర్ ప్రాంతం వేగంగా అభివృద్ది చెందుతుండటం వల్ల ఐటీ ఉద్యోగులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. దీంతో ఇక్కడ నుంచి ఐటీ కారిడార్‌కు ప్రజలు పెద్ద ఎత్తున రాకపోకలు కొనసాగిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ రద్దీ లేని ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా రోడ్లను విస్తరిస్తోంది.
