Hyderabad: హైద‌రాబాద్‌లో నకిలీ భూ ప‌త్రాల దందా గుట్టు రట్టు.. మల్కాజ్‌గిరిలో 9 మంది అరెస్ట్..

|

Apr 13, 2022 | 7:50 AM

Hyderabad Rachakonda Police: హైద‌రాబాద్‌లో మ‌రో నకిలీ ప‌త్రాల దందా వెలుగులోకి వ‌చ్చింది. న‌కిలీ భూప‌త్రాలు సృష్టించి, అక్రమాల‌కు పాల్పడుతున్న ఘ‌రానా ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

Hyderabad: హైద‌రాబాద్‌లో నకిలీ భూ ప‌త్రాల దందా గుట్టు రట్టు.. మల్కాజ్‌గిరిలో 9 మంది అరెస్ట్..
Hyd Police
Follow us on

Hyderabad Rachakonda Police: హైద‌రాబాద్‌లో మ‌రో నకిలీ ప‌త్రాల దందా వెలుగులోకి వ‌చ్చింది. న‌కిలీ భూప‌త్రాలు సృష్టించి, అక్రమాల‌కు పాల్పడుతున్న ఘ‌రానా ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తొందరగా డబ్బు సంపాదించడానికి కేటుగాళ్లు అడ్డదారులు తొక్కుతూ, అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా మల్కాజ్‌గిరి (malkajgiri zone) జోన్‌లో నకిలీ భూపత్రాల రాకెట్‌ను ఛేదించారు పోలీసులు. ఈ ముఠాలోని 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. మ‌రో ఇద్దరు ప‌రారీలో ఉన్నారు. ఈ న‌కిలీ భూప‌త్రాల రాకెట్‌కు సంబంధించి ప‌క్కా స‌మాచారంతో, రాచ‌కొండ స్పెషల్ ఆపరేషన్స్ టీం రంగంలోకి దిగింది. మ‌ల్కాజ్‌గిరి, కుషాయిగూడ పోలీసులతో కలిసి, భూమి విక్రయాల డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి, భూమోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టుచేశారు. వారి నుంచి నకిలీ సేల్ డీడ్ పత్రాలు, 10.4 లక్షల నగదు, రబ్బరు స్టాంపులు, సీల్స్, నాన్-జుడీషియల్ స్టాంప్ పేపర్లు, రెవెన్యూ స్టాంపులు, ఒక స్విఫ్ట్ కారు, పది సెల్ ఫోన్లు స‌హా అనేక వ‌స్తువుల‌ను స్వాధీనం చేసుకున్నారు.

చాలాకాలంగా అసలు భూ యజమానులు క్లెయిమ్ చేయని ఖాళీ స్థలాలను నిందితులు గుర్తించేవారని, ఆపై ఖాళీగా ఉన్న భూమికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీలను సేకరించి, నకిలీ సేల్ డీడ్‌లను సిద్ధం చేస్తున్నారని వివరించారు పోలీసులు. ఆ తర్వాత ఆ సేల్ డీడ్‌లో ఒరిజినల్ వెండర్‌తో సమానమైన వయస్సు ఉన్న వ్యక్తిని వెతకి, నకిలీ ఆధార్ కార్డులు, ఇత‌ర గుర్తింపు కార్డులు సృష్టించి, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసి డబ్బు వసూలు చేసినట్టు గుర్తించారు. ఆ తర్వాత అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకునేవారని వివరించారు రాచకొండ పోలీసులు.

నకిలీ సేల్ డీడ్‌లను ఉపయోగించి, పార్టీల మధ్య భూ వివాదాలను సృష్టించేవారని, అంతేకాకుండా వారి నుంచి డబ్బు డిమాండ్ చేసేవారని చెప్పారు పోలీసులు. హైద‌రాబాద్‌లోనే కాకుండా, రాజ‌ధాని శివారు ప్రాంతంలోనూ అనేక భూ అక్రమాల‌కు తెర‌లేపార‌ని వెల్లడించారు సీపీ మహేష్ భగవత్. ఇలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు పోలీసులు.

Also Read:

Pregnancy Care: ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతి ఉద్యోగం చేసే మహిళ ఈ విషయాలను గుర్తుంచుకోవాలి

Hair Care Tips: వేసవిలో అందమైన, మెరిసే జుట్టు కావాలా?.. అయితే, ఈ చిట్కాలను పాటించండి..!