
హైదరాబాద్ నగరంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో ‘ఇన్‌ఫ్లుయెన్జా-ఎ’ (Influenza A) వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలు, తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్న రోగుల తాకిడి ఒక్కసారిగా విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఈ వైరస్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఉష్ణోగ్రతలలో వస్తున్న హెచ్చుతగ్గులు, ఉదయం, సాయంత్రం వేళల్లో విపరీతంగా పెరుగుతున్న చలిగాలుల ప్రభావం వల్ల ఈ వైరస్ గాలి ద్వారా వేగంగా వ్యాపిస్తోందని పేర్కొంటున్నారు.. ఆసుపత్రులకు పోటెత్తుతున్న రోగులు: ఫీవర్ హాస్పిటల్, నిలోఫర్ తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రైవేట్ క్లినిక్‌లు, ఆసుపత్రుల ఓపీ (OP) విభాగాల ఎదుట జ్వరాల బాధితుల క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. వచ్చే రోగులలో ఎక్కువ మంది తీవ్రమైన ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నవారే ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు.
ఇన్‌ఫ్లూయెంజా ఎ.. అనేది శ్వాసకోశానికి సంబంధించిన వైరస్.. సాధారణంగా దీనిని ఫ్లూ అని పిలుస్తారు.. ఇది ముక్కు, గొంతు, కొన్నిసార్లు ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దగ్గు, తుమ్ముల సమయంలో వెలువడే సూక్ష్మ తుంపరల ద్వారా, అలాగే వైరస్ కలుషితమైన చేతులు లేదా ఉపరితలాలను తాకి ఆ తర్వాత కళ్లు, ముక్కు, నోటిని తాకడం ద్వారా ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో, గాలి ప్రసరణ సరిగా లేని గదుల్లో వైరస్ వ్యాప్తి ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతన్నారు..
ఈ వైరస్ సోకిన వ్యక్తులలో క్రింది రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు వెల్లడించారు..
ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి..
చిన్నారులు – వృద్ధులు: రోగ నిరోధక శక్తి (Immunity) తక్కువగా ఉండటం వల్ల ఐదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఈ వైరస్‌కు అత్యంత సులువుగా బలవుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు: డయాబెటిస్ (మధుమేహం), హైపర్ టెన్షన్ (బీపీ), ఆస్తమా లేదా ఇతర శ్వాసకోశ సమస్యలతో ఇప్పటికే బాధపడుతున్నవారికి ఈ వైరస్ సోకితే పరిస్థితి మరింత జటిలమయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సాధారణ జ్వరమే కదా అని మెడికల్ షాపుల్లో ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టానుసారంగా యాంటీబయోటిక్స్ లేదా పెయిన్ కిల్లర్స్ వాడటం ప్రాణాల మీదకు తెస్తుంది. లక్షణాలు కనిపిస్తే వెంటనే అర్హులైన వైద్యుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
బయటికి వెళ్లి వచ్చిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తూచా తప్పకుండా మాస్కులు ధరించడం మంచిది.
చిన్నారుల పట్ల అప్రమత్తత: పిల్లలకు జ్వరం లేదా దగ్గు లక్షణాలు ఉంటే వారిని బడులకు పంపకుండా ఇంట్లోనే విశ్రాంతినివ్వాలి. గోరువెచ్చని నీటిని తాగించడం, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.
సీజనల్ వ్యాధుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..