Miss World 2025: అందాల పోటీల సందడి షురూ..! భాగ్యనగరానికి చేరుకుంటున్న అందగత్తెలు..

రావమ్మా ముద్దుగుమ్మ.. భాగ్యనగరం మీకు స్వాగతం పలుకుతోంది.. నుదుటు కుంకుమ బొట్టుపెట్టి సంప్రదాయ బద్ధంగా పిలుస్తోంది.. హారతి పట్టి ఆహ్వానం పలుకుతోంది.. అందాల పోటీల్లో మీరే మొదటి స్థానంలో నిలవాలని కోరుకుంటోంది.. ఇలా మీ రాక మాకెంతో సంతోషమంటోంది హైదరాబాద్.. ఇలా.. భాగ్యనగరంలో అందాల పోటీల హడావుడి నెలకొంది..

Miss World 2025: అందాల పోటీల సందడి షురూ..! భాగ్యనగరానికి చేరుకుంటున్న అందగత్తెలు..
Miss Canada, Emma Morrison

Updated on: May 04, 2025 | 10:57 AM

తెలంగాణలో అందాల పోటీల హడావుడి ప్రారంభమైంది.. పలు దేశాల అందగత్తెలు హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్నారు. వారికి నిర్వాహకులు ఘన స్వాగతం పలుకుతున్నారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్‌ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధమైంది. వివిధ దేశాల సుందరీమణులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు.. కెనడా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మిస్‌ కెనడా క్యాథరన్‌ మోరిసన్‌కు ఘనస్వాగతం లభించింది. యువతులు సంప్రదాయ నృత్యాలు చేస్తుండగా.. తెలంగాణ సంప్రదాయం ప్రకారం హారతి పట్టి, నుదుట బొట్టుపెట్టి, మెడలో పూలమాల వేసి ఆహ్వానించారు. అనంతరం ఆమెను ఆతిథ్యం ఇచ్చే హోటల్‌కు తీసుకువెళ్లారు.

హైదరాబాద్‌ వేదికగా మిస్‌ వరల్డ్‌ -2025 పోటీలు ఇలా..

ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్‌ వేదికగా మిస్‌ వరల్డ్‌ -2025 పోటీలు జరగనున్నాయి. ఇందులో 120 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. 150 పైగా దేశాల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇప్పటికే మిస్‌వరల్డ్‌ సంస్థ CEO, చైర్‌సర్సన్‌ మిస్‌ జూలియా ఎవెలిన్‌ మోర్లీ, మిస్‌వరల్డ్‌ ప్రతినిధి మిస్‌ కెర్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇవాళ, రేపు 120 దేశాల నుంచి పోటీదారులు, ప్రతినిధులు నగరానికి చేరుకుంటారు.

సీఎస్ కీలక ఆదేశాలు..

మిస్‌వరల్డ్‌ పోటీదారులు, ప్రతినిధులకు శంషాబాద్‌ విమానాశ్రయంతోపాటు హోటళ్ల దగ్గర కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని CS రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. హైదరాబాద్ వస్తున్నవారు తెలంగాణలో పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా ఆయా ప్రదేశాలను సుందరీకరించాలన్నారు రామకృష్ణారావు.. ఇదిలాఉంటే.. మిస్‌వరల్డ్‌ పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి.. సోమవారం రివ్యూ నిర్వహించనున్నారు.

తెలంగాణను మెడికల్‌ టూరిజం హబ్‌గా ప్రపంచానికి పరిచయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మిస్‌ వరల్డ్‌ పోటీల వేదికగా ఈ విషయం ప్రపంచానికి చెప్పేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మెడికల్‌ టూరిజంపై ప్రచారం చేయడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా హెల్త్‌ టూరిస్టులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ ఖర్చుతో అందిస్తున్న వైద్య సేవలు, మెడికల్‌ టూరిజంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని తెలియజేసేలా AIG ఆస్పత్రిలో మెడికల్‌ టూరిజం ఈవెంట్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి

13న హెరిటేజ్‌ వాక్‌..

మరో వైపు ఈనెల 13న మిస్‌ వరల్డ్‌ పోటీదారులు చార్మినార్ దగ్గర హెరిటేజ్‌ వాక్‌ నిర్వహంచనున్నారు. ఇందుకోసం మదీనా, పత్తర్‌గట్టి, గుల్జర్‌ హౌస్‌, చార్మినార్‌, లాడ్‌ బజార్‌ గాజుల మార్కెట్‌ నుంచి చౌమొహల్లా ప్యాలెస్‌ వరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో షాపులకు కూడా మెరుగులు దిద్దుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..