అరేయ్ ఏంట్రా ఇది.. మటన్ బిర్యానీలో పుచ్చిపోయిన పన్ను.. అసలేం జరిగిందంటే..

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ రెస్టారెంట్‌లో మటన్ మండి బిర్యానీ తింటున్న కస్టమర్ దెబ్బకు షాకయ్యాడు..రెస్టారెంట్‌లో మటన్ బిర్యానీ తింటుండగా ఆహారంలో పంటి అవశేషం కనిపించింది.. దీంతో బాధితుడి ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అది నిజంగా పన్నేనా, ఆహారంలోకి ఎలా వచ్చిందనే విషయాలపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.

అరేయ్ ఏంట్రా ఇది.. మటన్ బిర్యానీలో పుచ్చిపోయిన పన్ను.. అసలేం జరిగిందంటే..
Tooth In Mutton Biryani

Edited By:

Updated on: Oct 15, 2026 | 7:56 AM

హైదరాబాద్‌ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో మటన్ మండి బిర్యానీ తింటున్న వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. బిర్యానీలో మనిషి పన్ను కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. మాదాపూర్‌లోని ది జాయింట్ అల్ మండి రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆహారంలో అనుమానాస్పద వస్తువు కనిపించడంపై బాధితుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. సంబంధిత రెస్టారెంట్‌ను తనిఖీ చేసి వివరాలు సేకరించారు. అయితే, బిర్యానీలో కనిపించిన వస్తువు నిజంగా మనిషి పన్నేనా.. లేక మరేదైనా వస్తువా అనే విషయంపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.

హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన శ్యామ్ ప్రసాద్ తన స్నేహితుడితో కలిసి మాదాపూర్‌లోని ది జాయింట్ అల్ మండి రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ మటన్ మండి బిర్యానీని ఆర్డర్ చేసి తినడం ప్రారంభించాడు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో అతడికి అనుకోని అనుభవం ఎదురైంది. బిర్యానీని సగం వరకు తిన్న తర్వాత ఆహారం తింటున్నప్పుడు నోటికి గట్టిగా ఏదో తగిలినట్లు గుర్తించాడు. దీంతో దాన్ని బయటకు తీసి పరిశీలించగా, అది మనిషి పన్నులా కనిపించిందని బాధితుడు ఆరోపించాడు. దీంతో శ్యామ్ ప్రసాద్ వెంటనే రెస్టారెంట్ నిర్వాహకులను ప్రశ్నించాడు. అయితే వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితుడు ఆరోపించాడు. ఆహారంలో ఇలాంటి వస్తువు కనిపించినప్పుడు బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందంటున్నాడు బాధితుడు.

ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేసిన శ్యామ్ ప్రసాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆహార నాణ్యతపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. బాధితుడి ఫిర్యాదుతో మాదాపూర్ సర్కిల్ ఫుడ్ సేఫ్టీ అధికారి నిహారిక సంబంధిత రెస్టారెంట్‌ను తనిఖీ చేశారు. ది జాయింట్ అల్ మండి రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించి ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. బిర్యానీలో కనిపించిన వస్తువు కృత్రిమ పన్ను అయి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, అది ఎలా ఆహారంలోకి వచ్చిందనే అంశాలపై తుది నిర్ధారణ రావాల్సి ఉంది. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. ఈ ఘటనతో హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార తయారీ, నిల్వ, వడ్డింపు ప్రక్రియల్లో పరిశుభ్రత ఎంత ముఖ్యమో మరోసారి చర్చకు వచ్చింది. వినియోగదారులకు అందించే ఆహారంలో బయటి వస్తువులు కలవకుండా చూసుకోవడం రెస్టారెంట్ నిర్వాహకుల బాధ్యత. వంటగది పరిశుభ్రతతో పాటు ముడి పదార్థాల నాణ్యత, ఆహార తయారీ విధానాలపై కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ప్రజలు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us