Hyderabad: ‘మృతదేహాన్ని ఎవరెస్ట్‌పైనే వదిలేస్తాం’.. హైదరాబాద్ పర్వతారోహకుడి కుటుంబ నిర్ణయం

మౌంట్ ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి తిరుగు ప్రయాణంలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్‌కు చెందిన పర్వతారోహకుడు అరుణ్‌కుమార్‌ తివారి మృతదేహాన్ని భారత్‌కు తీసుకురాకూడదని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నార. ఆధ్యాత్మిక విశ్వాసాలతో పాటు ఎవరెస్ట్‌ పర్వతంపై మృతదేహాల తరలింపు అత్యంత ప్రమాదకరమనే కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Hyderabad: ‘మృతదేహాన్ని ఎవరెస్ట్‌పైనే వదిలేస్తాం’.. హైదరాబాద్ పర్వతారోహకుడి కుటుంబ నిర్ణయం
Hyderabad Climber's Family Decides To Leave Body On Everest

Updated on: May 28, 2026 | 7:39 AM

హైదరాబాద్‌, మే 28: తెలంగాణకు చెందిన 53 ఏళ్ల అరుణ్‌కుమార్‌ తివారి ఐటీ రంగంలో పనిచేస్తూ పర్వతారోహణపై ప్రత్యేక ఆసక్తి పెంచుకున్నారు. గత వారం మౌంట్ ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన అనంతరం తిరుగు ప్రయాణంలో హిల్లరీ స్టెప్‌ సమీపంలో అస్వస్థతకు గురై మరణించినట్లు నేపాల్‌కు చెందిన యాత్ర నిర్వాహక సంస్థ ‘పయనీర్ అడ్వెంచర్స్’ వెల్లడించింది. ఆయనకు నలుగురు షెర్పాలు సహాయం చేసినప్పటికీ ఈ విషాదం చోటుచేసుకుంది. అయితే ఆయన మృత దేహాన్ని పర్వతంపైనే వదిలివేయాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

ఎవరెస్ట్‌ పర్వతాన్ని మేము పరమశివుడి నిలయంగా భావిస్తున్నాం. అక్కడే ఆయనకు అంతిమ విశ్రాంతి లభించడం మంచిదని కుటుంబం భావించింది. మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకురావడం అత్యంత క్లిష్టమైన పని. అప్పటికి బాడీ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. పైగా ఖర్చుతో కూడుకున్న పని అని తివారి బావమరిది సుధీర్ ఉపాధ్యాయ తెలిపారు. కుటుంబ సభ్యుల ప్రకారం ఈ నిర్ణయం కేవలం ఆర్థిక కారణాలతో తీసుకున్నది కాదని, హిమాలయాల పట్ల అపారమైన అనుబంధం కలిగిన తివారి కూడా ఇదే కోరుకునేవారని తెలిపారు. అరుణ్‌కుమార్‌ తివారి అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడు. మౌంట్ ఎల్బ్రస్‌, డెనాలి, అకాంకాగువా వంటి పర్వతాలను విజయవంతంగా అధిరోహించారు. 2025లో కూడా ఎవరెస్ట్‌ ఎక్కే ప్రయత్నం చేసినప్పటికీ ఆరోగ్య సమస్యల కారణంగా 7,200 మీటర్ల ఎత్తు వరకు వెళ్లి వెనుదిరిగారు. ఈసారి మాత్రం తన కలను నిజం చేసుకోవాలని సంకల్పంతో మళ్లీ ఎవరెస్ట్‌ ఎక్కేందుకు వెళ్లి, అనారోగ్యంతో అక్కడే మృతి చెందారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఇదే ఎవరెస్ట్‌ యాత్రలో అమెరికాలో నివసిస్తున్న సందీప్ ఆరే అనే మరో పర్వతారోహకుడు కూడా మరణించాడు. అతను మంచు చూపు సమస్య (స్నో బ్లైండ్నెస్‌), తీవ్రమైన అలసట కారణంగా క్యాంప్-3 సమీపంలో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే అతని మృతదేహాన్ని షెర్పాలు క్యాంప్-2 వరకు తీసుకురావడంతో హెలికాప్టర్ ద్వారా తరలించే అవకాశం లభించింది.

ఇవి కూడా చదవండి

ఎవరెస్ట్‌లో మృతదేహాల తరలింపు ఎందుకు ప్రమాదకరం?

మౌంట్ ఎవరెస్ట్‌లో 8,000 మీటర్లకు పైబడిన ప్రాంతాన్ని “డెత్ జోన్”గా పిలుస్తారు. అక్కడ ఆక్సిజన్‌ స్థాయిలు అత్యంత తక్కువగా ఉండటంతో మనుషులు ఎక్కువసేపు బతకడం కష్టమవుతుంది. ముఖ్యంగా హిల్లరీ స్టెప్‌ వంటి ప్రాంతాల్లో మంచు తుఫాన్లు, హిమపాతాలు, తీవ్రమైన చలి కారణంగా ప్రమాదాలు ఎప్పుడూ పొంచి ఉంటాయి. మృతదేహాన్ని తరలించేందుకు సాధారణంగా 8 నుంచి 12 మంది అనుభవజ్ఞులైన షెర్పాలు, అదనపు ఆక్సిజన్ సిలిండర్లు, ప్రత్యేక పరికరాలు అవసరం అవుతాయి. ఈ ప్రక్రియకు అనేక రోజులు పట్టడంతో పాటు దాదాపు రూ.71 లక్షల వరకు ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణాల వల్లే ఎవరెస్ట్‌పై మరణించిన పలువురు పర్వతారోహకుల మృతదేహాలను అక్కడే వదిలేయడం సాధారణంగా జరుగుతుందని పర్వతారోహణ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us