వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్రమట్టం నుంచి 7.6 కీ.మీ ఎత్తువరకు విస్తరించి ఉంది. ఇది ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ క్రమంలోనే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్‌లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు, మరికొన్ని చోట్ల భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా 31 డిగ్రీల వరకు ఉంటాయని, సాయంత్రం వాతావరణ పరిస్థితులు మారతాయని చెప్పారు. కాగా, శనివారం నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఆదివారం మెదక్, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 5 సెంటీమీటర్లు.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.