Free Drinking Water Supply Scheme: జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు ఉచితంగా తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ‘‘నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచిత మంచినీటి పథకాన్ని’’ సద్వినియోగం చేసుకోవాలని జలమండలి ఎండీ దానకిశోర్ సూచించారు. గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయం సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ.. ఉచిత 20 వేల లీటర్ల తాగునీటి పథకం పొందేందుకు జీహెచ్ఎంసీ పరిధిలోని గృహ వినియోగదారులు అర్హులేనని తెలిపారు. డొమెస్టిక్ – స్లమ్, డొమెస్టిక్ – ఇండివిడ్యువల్, మల్టీస్టోర్డ్ బిల్డింగ్(ఎంఎస్బీ), గేటెడ్ కమ్యూనిటీ కేటగిరీల కింద ప్రతీ గృహ వినియోగదారుడు ఈ పథకాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. ఈ పథకం కోసం నమోదు చేసుకున్న ప్రతీ ఇల్లు/ఫ్లాట్/యూనిట్ వినియోగదారులు నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా మంచినీటిని పొందేందుకు అర్హులని స్పష్టంచేశారు.
ఈ పథకాన్ని వినియోగించుకునేందుకు వినియోగదారులు తమ క్యాన్ నెంబరుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని కోరారు. కచ్చితంగా నల్లా కనెక్షన్లకు పని చేస్తున్న మీటరు ఉండాలని తెలిపారు. ఒకవేళ మీటరు లేని వారు కొత్త మీటరు అమర్చుకొని, ఆ వివరాలను సంబంధిత జలమండలి సెక్షన్ మేనేజర్కు తెలియజేయాలని లేదా జలమండలి వెబ్‌సైట్లో నమోదు చేయాలని సూచించారు. బస్తీల్లో నివసించే వినియోగదారులకు నల్లా మీటర్లు ఉండాల్సిన అవసరం లేదని, క్యాన్ నెంబరుకు ఆధార్ను మాత్రం కచ్చితంగా అనుసంధానం చేయాలని తెలిపారు.
నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి జలమండలి దాదాపుగా ఏడాది సమయాన్ని ఇచ్చింది. అయినా ఇప్పటికీ 4.3 లక్షల మంది వినియోగదారులు ఈ పథకం కోసం నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం.. గడువును డిసెంబరు 31 వరకు పొడిగించినట్లు దానకిశోర్ తెలిపారు. డిసెంబర్ 31లోగా సుమారు 60 వేల మంది వినియోగదారులు ఈ పథకం కోసం నమోదు చేసుకునే అవకాశం ఉందని, వీరితో కలిపి మొత్తం 5.5 లక్షల వినియోగదారులు, అంటే దాదాపుగా 56 శాతం వినియోగదారులు ఈ పథకాన్ని పొందుతారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
వారికి డిసెంబర్ నుంచి బిల్లులు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు వినియోగదారుల్లో గందరగోళం లేకుండా ఉండేందుకు, ఉచిత నీటి సరఫరా పథకానికి నమోదు చేసుకునేందుకు వెసులుబాటుగా ఉండేందుకు గానూ ఈ పథకాన్ని ప్రకటించిన 2020 డిసెంబరు నుంచి ఇప్పటివరకు (13 నెలలుగా) నీటి బిల్లులు జారీ చేయడం లేదు. ఈ డిసెంబరు 31 గడువులోగా ఈ పథకానికి నమోదు చేసుకున్న వినియోగదారులు ఈ 13 నెలల బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు. వీరికి నెలకు 20 వేల లీటర్ల వరకు జీరో బిల్లులు జారీ చేయడం జరుగుతుంది. డిసెంబరు 31 లోగా పథకంలో నమోదు చేసుకోని వారికి మాత్రం 2020 డిసెంబరు నుంచే బిల్లు జారీ చేస్తామని, వీరికి ఎటువంటి రాయితీలు ఉండవని తెలిపారు. అయితే, ఈ బిల్లుపై పెనాల్టీ, వడ్డీ మాత్రం విధించబోమని పేర్కొన్నారు. నాలుగు వాయిదాల్లో ఈ బిల్లును చెల్లించే వెసులుబాటును వినియోగదారులకు ఇస్తున్నట్లు తెలిపారు.
గడువు ముగిసినా..
ఈ డిసెంబరు 31 లోగా 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకానికి నమోదు చేసుకోని వారికి గడువు ముగిసిన తర్వాత కూడా (జనవరి 1, 2022 నుంచి కూడా) నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని, అయితే, నమోదు చేసుకున్న నాటి నుంచే వీరు ఉచిత 20 వేల లీటర్ల నీటి పథకానికి అర్హులు అవుతారని, అప్పటి వరకు బిల్లు చెల్లించాల్సిందేనని తెలిపారు.
జలమండలి 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎస్ఎంఎస్, టీవీ, ఎఫ్ఎం రేడియో, కరపత్రాలు, సోషల్ మీడియా వంటి వివిధ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తోందన్నారు. అలాగే, స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో వార్డుస్థాయి సమావేశాలు ఏర్పాటుచేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు ఎండీ దానకిశోర్ తెలిపారు. అలాగే, ఇంటింటికి జలమండలి సిబ్బంది వెళ్లి ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియను కూడా చేస్తుతున్నారని తెలిపారు. ఈ పథకానికి సంబంధించి వినియోగదారులకు ఎటువంటి సందేహాలు ఉన్నా 155313 నెంబరుకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, తదితరులు పాల్గొన్నారు.
Also Read: