ఎక్కడైనా, ఎప్పుడైనా పురావస్తు తవ్వకాలు జరిగినా.. ఏదొక అరుదైన వస్తువు, చారిత్రిక ఆనవాళ్లు లభించడం ఖాయం. అయితే ఇటీవల చాలామంది తమ స్వలాభం, మోసంతో లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టు పైపైన నమ్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనల గురించి మనం తరచూ చూస్తూనే ఉంటాం కూడా. ఏదైతేనే పురావస్తు తవ్వకాలు అంటే చాలు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయినట్టే. ఇక సరిగ్గా ఇలాంటి ఓ ఘటన తాజాగా హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.
హైదరాబాద్‌లోని రాంకోఠిలో గణేష్ ఆలయం పక్కన ఉన్న నవజీవన్ ఉమెన్స్ కాలేజీలో తవ్వకాలు జరిపారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. ఓ కృష్ణుడి విగ్రహం బయటపడింది. ఇక ఈ వార్త తెలియగానే.. స్థానికంగా ఉన్న జనాలు అక్కడికి పోటెత్తారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ కాలేజీలో తవ్వకాలు జరపగా.. కృష్ణుడి విగ్రహం బయటపడిందని సుల్తాన్ బజార్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు తెలిసింది. సదరు కాలేజీ చాలా సంవత్సరాల నుంచి మూతపడిందని.. బిల్డింగ్‌కి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోందని.. దాన్ని తప్పుదోవ పట్టించేందుకే.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కాలేజీ గేట్ తాళాలు పగలగొట్టి విగ్రహాన్ని పెట్టినట్టు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు ఆ సర్కిల్ ఇన్‌స్పెక్టర్. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.