
సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేరును కూడా వాడేశారు. ఆయన పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసి, వాటి ద్వారా చీటింగ్ సందేశాలు పంపుతున్నట్టు స్వయంగా సీపీనే చెప్పారు. ఈ నకిలీ ఖాతాల నుంచి ఎక్కువ మెసేజ్‌లు సజ్జనార్ స్నేహితులకు పంపారు. దీనిపై స్పందించిన హైదరాబాద్ కమిషనర్ నేరుగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. సైబర్ నేరగాళ్లు తన పేరుతో.. ఆపదలో ఉన్నాను… వెంటనే డబ్బులు పంపండి అంటూ మెసేజ్‌లు పంపుతున్నట్లు తెలిపారు. ఈ సందేశాలను నిజమని నమ్మిన ఒకరు ఇప్పటికే రూ.20,000 వాళ్లకు పంపినట్లు వెల్లడించారు. తన అసలు ఫేస్‌బుక్ పేజీ లింక్‌ను ప్రజలకు తెలియజేస్తూ.. అది తప్ప.. తన పేరుతో క్రియేట్ చేసినవి అన్నీ ఖాతాలు మొత్తంగా నకిలీవేనని స్పష్టం చేశారు.
సైబర్ మోసగాళ్లను కట్టడి చేసేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీమ్ మెటా సహకారంతో ఆ ఫేక్ ఖాతాలను గుర్తించి తొలగించే ప్రక్రియలో ఉన్నట్లు కూడా సజ్జనార్ వెల్లడించారు. ప్రముఖుల పేరుతో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, అనుమానాస్పద మెసేజ్‌లు, డబ్బులు పంపండి అంటూ వచ్చే మెసేజ్‌లు ఏవీ నమ్మవద్దని ఆయన హెచ్చరించారు. అలాంటి సందర్భాల్లో వెంటనే ఆ వ్యక్తినే ప్రత్యక్షంగా ఫోన్‌లో సంప్రదించి నిజమా కాదా ధృవీకరించుకోవాలన్నారు. అనుమానం కలిగించే లింకులు, వీడియో కాల్స్, మెసేజ్‌లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలని సూచించారు.
సైబర్ మోసాలకు పాల్పడే నకిలీ అకౌంట్లు కనిపించినప్పుడు 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడం లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయడం అత్యవసరమని సీపీ చెప్పారు. జాగ్రత్తగా ఉంటేనే సైబర్ మోసగాళ్ల ఉచ్చు లో పడకుండా మన డబ్బు, వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుందని ఆయన హితవు పలికారు. స్టే అలెర్ట్.. స్టే సేఫ్ అంటూ హెచ్చరిక జారీ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..