Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం నిధులు.. బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..

హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం ఖర్చును భరించే ప్రతిపాదన సిద్దంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కీలక ప్రకటన చేశారు. అలాగే మూసీ ప్రక్షాళనకు కూడా సాయం చేయనుంది.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం నిధులు.. బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..
Hyderabad Metro Rail

Updated on: May 20, 2026 | 4:22 PM

హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మెట్రో విస్తరణకు కేంద్రం నిధులు అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం చెరో 50 శాతం చొప్పున ఖర్చును భరించే ప్రతిపాదన ముందుకొచ్చింది. కేంద్రం హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు 50 శాతం ఖర్చును భరించేందుకు సిద్దంగా ఉందని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లార్ ఖట్టర్ తెలిపారు. మూసీ ప్రక్షాళనకు కూడా తాము సహకరిస్తామని తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద రూ.3,975 కోట్లతో 39 ఎస్‌టీపీలు మంజూరు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. మెట్రో రెండో దశ విస్తరణ డీపీఆర్‌తో పాటు ఇతర సాంకేతిక వివరాలు అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చడంపై తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

మెట్రో సెకండ్ ఫేజ్‌కు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మెట్రో సెకండ్ ఫేజ్‌కి సంబంధించి ప్రతిపాదనలు సమర్పించిందని మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు. దీనిని సమగ్రంగా పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందని వివరించారు. రెండో దశ విస్తరణకు సంబంధించి 162 కిలోమీటర్లకు ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. త్వరలోనే రెండో దశపై తుది నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే మూసీ ప్రక్షాళనకు సాయం అందించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని పేర్కొన్నారు.

39 సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు

ఢిల్లీలో కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనపై చర్చించారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఎక్స్‌లో కిషన్ రెడ్డి వివరించారు. “న్యూఢిల్లీలో కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిశాను. మేము హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు సంబంధించిన విషయాలు, తెలంగాణలో వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పురోగతి, అమలు గురించి చర్చించాము” అని పేర్కొన్నారు. అమృత్ భారత్ 2.0 పథకంలో భాగంగా మూసీ నదిలో కలుస్తున్న మురుగు నీటిని శుద్ది చేసేందుకు 39 సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను మంజూరు చేస్తామన్నారు. వీటి కోసం రూ.3,975 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. శుద్ది చేయని మురుగు నీరు మూసీలో కలవకుండా ఈ ప్లాంట్ల వల్ల నిరోధించవచ్చన్నారు. హైదరాబాద్ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Follow Us