
హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, హైపర్ వాల్ట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో టీసీఎస్ ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సమావేశంలో పాల్గొన్నారు. టీసీఎస్ సీఈఓ కృతివాసన్, సీఓఓ ఆర్తి సుబ్రమణియన్, హైపర్ వాల్ట్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓపెన్‌ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉదయ్ రుద్రరాజు సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, పెట్టుబడుల శాఖ ప్రతినిధులు కూడా ఈ చర్చల్లో భాగమయ్యారు.
ఈ భారీ డేటా సెంటర్ క్యాంపస్‌ను 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 1 గిగావాట్ అంటే 1,000 మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక కంప్యూటింగ్ మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నారు.
హైపర్ వాల్ట్‌తో పాటు భాగస్వామ్య సంస్థలు ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ కోసం దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రపంచ స్థాయి ఏఐ సంస్థలు, హైపర్‌స్కేలర్లు, గ్లోబల్ కంపెనీలకు అవసరమైన భారీ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని ఈ క్యాంపస్ అందించనుంది. హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్‌తో పాటు లిక్విడ్ కూలింగ్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఈ క్యాంపస్‌ను గ్రీన్ ఎనర్జీ ఆధారంగా అభివృద్ధి చేయనున్నారు. వాటర్ న్యూట్రల్ డిజైన్‌ను కూడా ప్రాజెక్టులో భాగంగా అమలు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టు తెలంగాణతో పాటు దేశానికి కూడా చారిత్రాత్మకమైనదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఏఐ రంగంలో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో కీలక కేంద్రంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏఐ మోడల్స్, కంప్యూటింగ్ సామర్థ్యం కీలక మౌలిక వసతులుగా మారనున్న నేపథ్యంలో వాటిని తెలంగాణలో అందుబాటులోకి తీసుకురావడం రాష్ట్రానికి పెద్ద ప్రయోజనమని చెప్పారు.
టీసీఎస్ భారీ పెట్టుబడికి ముందుకు రావడం తన కలను సాకారం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు బలమైన పునాది వేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్-2047లో నిర్దేశించిన 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనలో ఇది కీలక అడుగుగా అభివర్ణించారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తొలి కీలక చర్చలు 2026 జనవరిలో దావోస్‌లో జరిగాయి. సీఎం రేవంత్‌రెడ్డి, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మధ్య జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు నాంది పడింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, టీసీఎస్ ప్రతినిధుల మధ్య వరుస చర్చలు జరిగాయి.
దేశంలోని మరో ఐదు రాష్ట్రాలు ఈ భారీ ప్రాజెక్టును ఆకర్షించేందుకు పోటీ పడినప్పటికీ తెలంగాణకు అవకాశం దక్కింది. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఏఐ, డేటా సెంటర్ హబ్‌ను ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు ఇది మరింత ఊతం ఇవ్వనుంది.
డేటా సెంటర్‌తో ఏఐ రంగంతో పాటు విద్యుత్, కూలింగ్, నెట్‌వర్కింగ్, నిర్మాణం, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి అనేక అనుబంధ రంగాల్లో కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. ఫ్యూచర్ సిటీకి ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తోంది.