Hyderabad: జస్ట్.. 2 గంటల్లో హైదరాబాద్ నుంచి చెన్నైకి.. తిరుపతి మీదుగా బుల్లెట్ ట్రైన్..

హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. ఈ హైస్పీడ్ రైలుతో 12 గంటల ప్రయాణం కేవలం 2.20 గంటలకు తగ్గుతుంది. తమిళనాడు ప్రభుత్వానికి తుది అలైన్‌మెంట్ నివేదిక సమర్పించారు, ఇందులో తిరుపతిలో కొత్త స్టేషన్ చేర్చారు. ఈ ప్రాజెక్టుకు 223.44 హెక్టార్ల భూమి అవసరం కాగా, భూసేకరణకు వేగం పెంచాలని రైల్వే శాఖ కోరింది.

Hyderabad: జస్ట్.. 2 గంటల్లో హైదరాబాద్ నుంచి చెన్నైకి.. తిరుపతి మీదుగా బుల్లెట్ ట్రైన్..
Hyderabad To Chennai Bullet Train

Updated on: Nov 26, 2025 | 8:30 AM

చెన్నై- హైదరాబాద్ వాసుల బుల్లెట్ రైలు కల త్వరలో సాకారం కానుంది.  హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ రైలు మార్గం ప్రాజెక్టు తుది అలైన్‌మెంట్‌ నివేదికను దక్షిణ మధ్య రైల్వే తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది. ఇది ఇంటర్‌ సిటీ ప్రయాణంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి చెన్నైకి రైలు ప్రయాణానికి దాదాపు 12 గంటలు పడుతోంది. కొత్త హైస్పీడ్‌ మార్గం అందుబాటులోకి వస్తే ఈ సమయం గణనీయంగా తగ్గి కేవలం 2.20 గంటలకు చేరుకుంటుంది.

కొత్తగా తిరుపతి..

తమిళనాడు ప్రభుత్వం కోరిక మేరకు గతంలో గూడూరు మీదుగా ఉన్న ప్రణాళికను మార్చి తిరుపతిలో స్టేషన్‌ను చేర్చారు. తమిళనాడు రాష్ట్ర పరిధిలో మొత్తం రెండు స్టేషన్లు ప్రతిపాదించారు. తమిళనాడులో చెన్నై సెంట్రల్, చెన్నై రింగు రోడ్డు స్టేషన్ ఉంటాయి. అయితే వాణిజ్య, రవాణా సౌలభ్యం కోసం, రైల్వే శాఖ ప్రతి స్టేషన్ చుట్టూ దాదాపు 50 ఎకరాల స్థలాన్ని కోరింది.

12 కి.మీ. టన్నెల్..

సమగ్ర ప్రాజెక్టు నివేదికపై ప్రభుత్వ ఆమోదం లభించిన నెలలోపు తుది నిర్ణయం తీసుకుంటామని చెన్నై యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ తెలిపింది. ఈ హైస్పీడ్‌ నెట్‌వర్క్‌ నిర్మాణంలో తమిళనాడు పరిధిలో 12 కి.మీ.ల సొరంగ మార్గం ఉండనుంది. ఈ ప్రాజెక్టుకు మొత్తం 223.44 హెక్టార్ల భూమి అవసరం కాగా, ఇందులో అటవీ భూమి లేదని రైల్వే అధికారులు ధృవీకరించారు. ఈ మార్గం దాదాపు 65 రోడ్లు, 21 హైటెన్షన్‌ విద్యుత్తు లైన్లను దాటాల్సి ఉంటుంది. ప్రభుత్వ కన్సల్టెన్సీ సంస్థ రైట్స్ లిమిటెడ్ నిర్వహించిన సర్వేల ఆధారంగా ఈ అలైన్‌మెంట్ రూపొందించారు.

దక్షిణాదిన ప్రణాళికలో ఉన్న రెండు హైస్పీడ్‌ మార్గాలలో ఇది ఒకటి కాగా, రెండోది హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌గా ఉంది. భూసేకరణపై జాప్యాన్ని నివారించేందుకు త్వరగా స్థలాల ఖరారు చేయాలని రైల్వేశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.