డ్రగ్స్ అక్రమ రవాణా నియంత్రణకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. స్మగ్లర్లలో ఏమాత్రం భయం, బెరుకు లేకుండా పోతోంది. ఓవైపు దొరికిపోతున్నా.. మరోవైపు నిరంతరం ప్లాన్స్ మారుస్తూ డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నైరోబి నుండి సార్జా మీదుగా ఎయిర్ అరేబియా విమానంలో ఓ మహిళ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. అయితే.. ఆమె ప్రవర్తన కాస్త భిన్నంగా ఉండటంతో అధికారులు అనుమానించారు. ఆమెను అడ్డగించి తనిఖీలు చేశారు కస్టమ్స్ అధికారులు. దాంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె వద్ద భారీగా డ్రగ్స్ లభ్యమయ్యాయి. ఆ డ్రగ్స్‌ను పట్టుకొచ్చిన విధానం చూసి అధికారులు షాక్ అయ్యారు.
బురండి దేశం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆమె.. ఆఫ్రికన్ దేశానికి చెందిన మూడు ఖరీదైన డ్రెస్సులు, హాండ్ బ్యాగ్, సోప్ కవర్స్లో డ్రగ్స్ తీసుకొచ్చింది. ఆ మహిళా ప్రయాణికురాలి నుంచి 2 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ ఆఫీసర్స్. కాగా, పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు రూ. 14.40 కోట్లు ఉంటుందని వెల్లడించారు కస్టమ్స్ అధికారులు. డ్రగ్స్ తరలించేందుకు ఆమె వేసిన ఎత్తులను చూసి కస్టమ్స్ అధికారులే నివ్వరపోయారు. మొత్తంగా.. డ్రగ్స్‌తో పట్టుబడ్డ బురండీ దేశం నుంచి వచ్చిన మహిళపై కేసు నమోదు చేసి.. ఆమెను రిమాండ్‌కు తరలించారు. ఆమె నుంచి డ్రగ్స్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు కస్టమ్స్ అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..