
హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థి కొల్కూరి భరద్వాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడితోనే ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ.. అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. రామంతాపూర్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్న భరద్వాజ్ ఆదివారం తెల్లవారుజామున సుమారు 3.20 గంటల సమయంలో ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు అతడి కోసం ఆరా తీసినట్లు తెలుస్తోంది.
రామంతాపూర్‌లో నిర్మాణంలో ఉన్న NSL భవనంపై నుంచి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ముందు ఎవరితోనైనా మాట్లాడాడా? అతడి మానసిక పరిస్థితి ఎలా ఉంది? చదువుకు సంబంధించిన ఒత్తిడి ఏమైనా ఉందా? అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
చిన్న వయసులోనే ఎంబీబీఎస్‌లో సీటు సాధించి వైద్య విద్యను అభ్యసిస్తున్న భరద్వాజ్ మృతి కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. భవిష్యత్తులో వైద్యుడిగా ఎదగాల్సిన యువకుడు ఇలా మృతి చెందడం స్థానికంగా కూడా విషాదాన్ని నింపింది. అయితే ఘటనకు ఖచ్చితమైన కారణం ఏమిటనేది పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి