హైదరాబాద్ నగరంలో వాహనాల రద్దీ (Vehicles Rush) విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా శబ్ధ కాలుష్యం రోజు రోజుకు అధికమవుతోంది. ఇప్పటికే వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను అధిక తీవ్రత కలిగిన శబ్దాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. హారన్లు, సైలెన్సర్ల వినియోగంతో పలుచోట్ల పరిమితికి మించి శబ్దకాలుష్యం (Sound Pollution) నమోదవుతోంది. దీంతో ప్రజలకు అనారోగ్య, శాశ్వత వినికిడి లోపం, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫ్యాన్సీ సైలెన్సర్లు, ప్రెషర్ హారన్లు, సిగ్నల్ దగ్గర బండి వెళ్లడానికి అవకాశం లేకున్నా హారన్ కొట్టడం, రణగొణ ధ్వనులు, వేడుకలు, సభలు, సమావేశాల్లో భారీ లౌడ్ స్పీకర్లు వీటన్నింటి కారణంగా శబ్ద కాలుష్యం జటిలమవుతోంది. నగరంలో 9 ప్రాంతాల్లో పీసీబీ శబ్ద కాలుష్యాన్ని నమోదు చేస్తుండగా అన్నిచోట్లా సగటున 5-10 డెసిబుల్స్ ఎక్కువగా నమోదవుతోంది. వాహనాలకు అదనపు హంగుల కోసం భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లు, హారన్లు బిగించడం దీనికి ప్రధాన కారణం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థ విస్తరణను పట్టించుకోకపోవడం ప్రధాన సమస్యగా మారింది.
రోడ్లపై నిత్యం 50 లక్షల నుంచి 60 లక్షల వాహనాలు తిరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఆర్టీసీకి చెందిన దాదాపు వెయ్యి డొక్కు బస్సులు, వేలాది పాత రవాణా వాహనాలు, కార్లు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. వీటి వల్ల పెద్దఎత్తున శబ్ద కాలుష్యం(Noise pollution) వెలువడుతోంది. రవాణా శాఖ నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను అధికారులు నియంత్రించాల్సి ఉంది. కాలం తీరిన వాహనాలను నియంత్రించడంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు.శబ్ద కాలుష్యం కారణంగా వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లకు ఏకాగ్రత లోపించి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మానసిక ప్రశాంతత లోపించి చిరాకు, ఆందోళనకు దారి తీస్తుందన్నారు. పరిమితికి మించి శబ్దాలు వచ్చే ప్రాంతంలో ఎక్కువసేపు ఉంటే బీపీ పెరుగుతుందని, శాశ్వత వినికిడి లోపం, మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
Also Read
Viral Video: అర్ధరాత్రి వంటగదిలో వింత శబ్ధాలు.. దొంగ అనుకుని వెళ్లి చూస్తే ఫ్యూజులు ఔట్..!
Morning: మార్నింగ్ లేవగానే ఈ పనులు చేయండి.. హుషారుగా ఉంటారు..!