
హైదరాబాద్ పంజాగుట్టలోని హిందూ శ్మశానవాటికలో ఆరు నెలల పసికందు మృతదేహం అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. అనారోగ్యంతో ఒక రోజు వ్యవధిలోనే కవల పిల్లలను కోల్పోయిన కుటుంబానికి ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పూడ్చిపెట్టిన నాలుగు రోజులకే మృతదేహం కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
చార్మినార్ పరిధిలోని ఘన్సీబజార్‌కు చెందిన దంపతులకు ఆరు నెలల క్రితం కవలలు జన్మించారు. పుట్టినప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఇద్దరినీ బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో కవలల్లో ఓ పసికందు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు శిశువు మృతదేహాన్ని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని పంజాగుట్ట హిందూ శ్మశానవాటికకు తీసుకెళ్లి ఖననం చేశారు. ఖననం కోసం శ్మశానవాటిక సిబ్బంది కుటుంబం నుంచి రూ.2,500 తీసుకున్నట్లు సమాచారం.
మొదటి పసికందును ఖననం చేసిన మరుసటి రోజే కుటుంబానికి మరో విషాదం ఎదురైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రెండో కవల కూడా ఆదివారం రాత్రి మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆ బాధలోనే సోమవారం రెండో పసికందు మృతదేహంతో పంజాగుట్ట శ్మశానవాటికకు వెళ్లిన కుటుంబ సభ్యులకు అక్కడ ఊహించని దృశ్యం కనిపించింది. మొదటి పసికందును పూడ్చిన ప్రదేశంలో గుంత తీసి ఉన్నట్లు గమనించారు. అక్కడ మృతదేహం లేకపోగా ఖాళీ గుంత మాత్రమే కనిపించింది. మృతదేహం కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే శ్మశానవాటిక సిబ్బందిని నిలదీశారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో రెండో పసికందు అంత్యక్రియలు పూర్తయిన అనంతరం కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. శ్మశానవాటికలో పనిచేసే కాటికాపరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పసికందు మృతదేహం ఎలా అదృశ్యమైంది? ఖననం చేసిన ప్రాంతాన్ని ఎవరు తవ్వారు? సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి