AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బెట్టింగ్ పిచ్చి.. యూట్యూబ్‌లో చూసి ఈ కేటుగాడు ఏం చేశాడో తెలుసా..?

క్రికెట్ బెట్టింగ్ వ్యసనం అతడిని అప్పుల ఊబిలోకి నెట్టింది.. అప్పులు తీర్చేందుకు యూట్యూబ్‌లో క్రైమ్ పాఠాలు నేర్చుకుని ఏకంగా చైన్ స్నాచర్‌గా మార్చేసింది.. నగరంలో 76 ఏళ్ల వృద్ధురాలి మెడలోంచి రూ.3.5 లక్షల విలువైన బంగారు గొలుసును లాక్కెళ్లిన కేటుగాడి గుట్టును చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Hyderabad: బెట్టింగ్ పిచ్చి.. యూట్యూబ్‌లో చూసి ఈ కేటుగాడు ఏం చేశాడో తెలుసా..?
Man Addicted To Cricket Betting Turns Chain Snatcher
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Nov 03, 2026 | 5:25 PM

Share

క్రికెట్ బెట్టింగ్ వ్యసనం పచ్చని జీవితాలను ఎలా నాశనం చేస్తుందో, క్షణికావేశంలో చేసే అప్పులు మనుషులను ఎంతటి ఘోరాలకు పురిగొల్పుతాయో చెప్పేందుకు నగరంలో వెలుగుచూసిన ఈ ఘటనే తాజా నిదర్శనం. బెట్టింగ్‌లో పెట్టిన డబ్బంతా పోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ వ్యక్తి.. వాటిని తీర్చేందుకు అడ్డదారి తొక్కాడు. ఏకంగా యూట్యూబ్‌లో వీడియోలు చూసి చైన్ స్నాచింగ్ ఎలా చేయాలో ట్రెయినింగ్ తీసుకుని, ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని టార్గెట్ చేసి దొంగతనానికి పాల్పడ్డాడు. చివరకు చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల నిఘాకు చిక్కి కటకటాలపాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బాలాపూర్‌కు చెందిన మహమ్మద్ గౌస్ పాషా (34) కొద్దికాలంగా క్రికెట్ బెట్టింగ్‌కు బానిసయ్యాడు. బెట్టింగుల్లో లక్షలాది రూపాయలు పోగొట్టుకోవడంతో అప్పులు గుట్టలుగా పేరుకుపోయాయి. అప్పుల వారి నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం చైన్ స్నాచింగ్ చేయాలని పథకం వేశాడు. సాధారణంగా ప్రజలు యూట్యూబ్‌ను నైపుణ్యాలు, విజ్ఞానం కోసం ఉపయోగిస్తే.. ఈ నిందితుడు మాత్రం జనం కళ్లుగప్పి చైన్ స్నాచింగ్ ఎలా చేయాలి? బైక్‌పై ఎలా తప్పించుకోవాలి? అనే అంశాలపై యూట్యూబ్‌లో గంటల తరబడి వీడియోలు చూసి నేర పాఠాలు నేర్చుకున్నాడు.

వృద్ధురాలిపై కన్ను.. క్షణాల్లో గొలుసు మాయం

యూట్యూబ్‌లో చూసిన ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగిన గౌస్ పాషా.. సైదాబాద్‌లోని కరన్‌బాగ్ ప్రాంతంలో ఒంటరిగా సంచరిస్తున్న 76 ఏళ్ల మీనాక్షి అనే వృద్ధురాలిని టార్గెట్ చేశాడు. బైక్‌పై ఆమెను సమీపించి, క్షణాల వ్యవధిలో మెడలోని బంగారు గొలుసును బలంగా లాక్కొని అక్కడి నుంచి వేగంగా ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైదాబాద్ పోలీసులు, చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడి కదలికలను గుర్తించారు.

పోలీసుల మెరుపు దాడి.. నిందితుడి అరెస్ట్

పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడు మహమ్మద్ గౌస్ పాషాను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి సుమారు రూ.3.5 లక్షల విలువైన బంగారు గొలుసుతో పాటు నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు బెట్టింగ్ అప్పుల కోసమే ఈ చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, గేమింగ్ యాప్‌ల బారినపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

Follow Us