Hyderabad: కబ్జాదారులపై ఉక్కుపాదం.. 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..

హైడ్రా అంటే కేవలం ఆక్రమలను కూల్చడం మాత్రమే కాదని.. అక్రమార్కులను నుంచి ప్రభుత్వ భూములను రక్షించడంలోనూ అండగా నిలుస్తోంది. తాజాగా హైదరాబాద్ శివారులోని బోడుప్పల్, మల్కాజిగిరి పరిధిలో పార్కు స్థలాలను ఆక్రమించేందుకు ప్రయత్నించిన కబ్జా కోరుల నుంచి సుమారు 1166 గజాల స్థలాన్ని కాపాడింది.

Hyderabad: కబ్జాదారులపై ఉక్కుపాదం.. 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
Hydraa Reclaims Encroached Land In Malkajgiri

Edited By:

Updated on: Jun 30, 2026 | 7:33 PM

హైదరాబాద్ నగర శివార్లలో ప్రభుత్వ భూములు, పార్కు స్థలాల ఆక్రమణలను అరికట్టే చర్యల్లో భాగంగా హైడ్రా (HYDRAA) మరో కీలక చర్య చేపట్టింది. మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని టెలిఫోన్ కాలనీలో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ స్థానికులు చేసిన ఫిర్యాదుపై అధికారులు వెంటనే స్పందించారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన పార్కు స్థలం ఆక్రమణకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.

స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు టెలిఫోన్ కాలనీలోని సర్వే నంబర్లు 78, 79లో ఉన్న 1166 చదరపు గజాల స్థలాన్ని పరిశీలించారు. రికార్డులను పరిశీలించిన అనంతరం అది పార్కు స్థలమని నిర్ధారించిన అధికారులు వెంటనే అక్కడ రక్షణ చర్యలు ప్రారంభించారు. స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

అంతేకాకుండా, స్థలంలో “ఈ భూమి పార్కు స్థలం.. హైడ్రా పరిరక్షణలో ఉంది” అంటూ స్పష్టమైన హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. పార్కు స్థలాన్ని ఆక్రమించడం, ఎలాంటిఅక్రమ నిర్మాణాలు చేపట్టడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు హెచ్చరించారు.

నగరంలో ప్రజలకు అవసరమైన ఓపెన్ స్పేస్‌లు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను పరిరక్షించేందుకు తమ చర్యలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఎక్కడైనా ప్రభుత్వ భూములు లేదా ప్రజా ప్రయోజనాలకు కేటాయించిన స్థలాలపై ఆక్రమణలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

ఈ ఘటనలో కాలనీ వాసులు సకాలంలో ఫిర్యాదు చేయడంతో 1166 చదరపు గజాల పార్కు స్థలం కబ్జాకు గురికాకుండా రక్షణ లభించిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సహకారంతో ప్రభుత్వ స్థలాలను కాపాడటం మరింత సులభమవుతుందని, ఇలాంటి అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us