
ఔట్ సైడ్ ఫుడ్ ఎప్పుడైనా.. అవుట్ సైడే. అందుకే తప్పని పరిస్థితులో తప్ప ఎప్పుడూ బయటిఫుడ్‌ను తినకపోవడమే ఉత్తమం అని అధికారుల దాడులను చూస్తే అర్దమవుతుంది. జిహ్వ చాపల్యాన్ని అదుపులో పెట్టుకోవడమే బెటర్ అనుకునేలా ఉంది. అవును పైకి అట్టహాసంగా కనిపించే హోటళ్లు, రెస్టారెంట్లో కూడా కనీస నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడం ఫుడ్ప్రియులను కలవరపడేలా చేస్తోంది.
ఇటీవల కాలంలో కొన్నిచోట్ల ఫుడ్‌సేఫ్టీ అధికారులు నిర్వహించిన దాడులను చూస్తే బయట ఆహారానికి ఎంత దూరం ఉంటే అంత బెటర్ అన్న ఆలోచన కలిగేలా చేస్తోంది. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించగా.. విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. కస్టమర్లకు వేడివేడిగా వండిస్తున్న ఆహారపదార్ధాలు.. ఫ్రెష్‌గా వండినవి కావని గుర్తించారు. నిల్వ చేసిన ఆహార పదార్ధాలనే వేడి చేసి సర్వ్ చేస్తున్నట్టు తెలుసుకున్నారు. వెజ్ బిర్యానీ సహా, పన్నీర్ టిక్కా, చట్నీ, సమోసా వంటి పదార్ధాలు కూడా నిల్వ చేసినవే ఉన్నాయి.
నింబంధనలకు పాతర!
ఆరుగంటల కంటే ఎక్కువ నిల్వ చేసి వడ్డించకూడదన్న నిబంధనలను చాలా హోటళ్లు, రెస్టారెంట్లు తుంగలో తొక్కుతున్నాయని అధికారులు తెలిపారు. ఇలాంటి ఆహార పదార్ధాలను వేడి చేసి సర్వ్ చేస్తే ఆరోగ్యంపై తీవ్ర దుష్ర్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన కొన్ని హోటళ్లను అధికారులు మూసివేశారు. మరికొన్ని హోటళ్లకు షోకాజు నోటీసులు ఇచ్చారు. ఇంకొన్ని వాటికి ఇంప్రూమ్‌మెంట్ నోటీసులను జారీ చేశారు. ఈ దాడుల్లో FSSAI గడువు ముగిసిన హోటళ్లు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వెజ్, నాన్‌వెజ్.. వంటకం ఏదైనా తినేముందు ఆలోచించాలని, రెస్టారెంట్లలో అనేక లోపాలున్నట్టు అధికారులు హెచ్చరిస్తున్నారు.
తనిఖీల్లో బయటపడ్డ యవ్వారం!
తాజాగా హైదరాబాద్ మహానగరంలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై తెలంగాణ ఆహార, నిత్యావసర ఔషధాల ప్రమాణాల అథారిటీ (TG SAFE) కొరడా ఝళిపించింది. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాలు చేస్తున్న సంస్థలపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తీవ్రమైన ఉల్లంఘనలు బయటపడటంతో ఆరు సంస్థల FSSAI లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేశారు. వాటి కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు.
ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు..!
గురువారం (నవంబర్ 19) ఆహార భద్రతా అధికారులు, పోలీసులతో కూడిన ప్రత్యేక బృందాలు హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. మొత్తం 15 మాంసం రిటైల్, ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు నాలుగు కరాచీ బేకరీ తయారీ కేంద్రాలను పరిశీలించాయి. ఈ తనిఖీల్లో సుమారు 1,672 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకోవడం లేదా పారవేయడం చేశారు. వీటి విలువ రూ.6.59 లక్షలుగా అధికారులు వెల్లడించారు. చెల్లుబాటు అయ్యే FSSAI లైసెన్సులు లేకుండా వ్యాపారాలు నిర్వహించడం, రక్తం, మాంసం అవశేషాలతో అపరిశుభ్రంగా మారిన నేలలు, మూసుకుపోయిన డ్రైనేజీలు, మురికి గోడలు వంటి సమస్యలను గుర్తించారు. అంతేకాకుండా ఈగలు, బొద్దింకల బెడద, సజీవ ఎలుకలు, ఆహార పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం, తప్పనిసరి రికార్డుల నిర్వహణలో వైఫల్యాలను అధికారులు గుర్తించారు.
ఆరు సంస్థల లైసెన్సులు సస్పెండ్!
తీవ్రమైన ఆహార భద్రతా ఉల్లంఘనలు గుర్తించిన ఆరు సంస్థల FSSAI లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. వాటిలో జమిస్తాన్పూర్లోని వతన్ ట్రేడర్స్, సికింద్రాబాద్‌లోని పంజాబ్ ఫిష్ కంపెనీ, ఎస్డీ రోడ్‌లోని హై ప్రోటీన్, శ్రీనగర్ కాలనీలోని కరాచీ ఐఎన్సి, గగన్‌పహాడ్‌లోని కరాచీ బేకరీ పెర్ల్, ఉప్పల్‌లోని ఎస్ఎం సీఏ కార్పొరేషన్ ఉన్నాయి. ఈ సంస్థల్లో చేపల ప్రాసెసింగ్, నిల్వ కేంద్రాలు అపరిశుభ్రంగా ఉండటం, గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులు విక్రయానికి సిద్ధంగా ఉంచడం, కోడి మాంసం ప్రాసెసింగ్ ప్రాంతాల్లో ఎలుకలు సంచరించడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి. శాకాహార, మాంసాహార పదార్థాలను వేర్వేరుగా నిల్వ చేయడంలోనూ నిర్లక్ష్యం కనిపించింది.
కరాచీ బేకరీలో భారీగా ఉల్లంఘనలు
గగన్‌పహాడ్‌లోని కరాచీ బేకరీ పెర్ల్ తయారీ కేంద్రంలో అధికారులు పలు లోపాలను గుర్తించారు. బేకరీ యంత్రాల నిర్వహణ సరిగా లేకపోవడం, తుప్పు పట్టిన బేకింగ్ ట్రేలు, కీటకాల బెడద, ఆహార పదార్థాలను సరైన విధంగా నిల్వ చేయకపోవడం వంటి సమస్యలు బయటపడ్డాయి. ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల లేబుళ్లపై తయారీ తేదీల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సుమారు 1,012 కిలోల ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4.34 లక్షలుగా వెల్లడించారు.
మరో ఐదు సంస్థల మూసివేతకు ఆదేశాలు
FSSAI లైసెన్సులు లేకుండా అపరిశుభ్ర పరిస్థితుల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న మరో ఐదు సంస్థల కార్యకలాపాలను కూడా నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. వాటిలో నల్లకుంటలోని ఆనంద్ మటన్ అండ్ చికెన్ పాయింట్, యూసుఫ్‌గూడలోని సల్మాన్ KGN పౌల్ట్రీ, న్యూ డీసెంట్ మీట్ చికెన్ అండ్ ఫిష్ షాప్, ఎస్పీ రోడ్‌లోని ప్రోటీన్ ఫుడ్స్, మల్కాజ్‌గిరిలోని ఏపీ ఫిషరీస్ ఫిష్ స్టాల్ ఉన్నాయి. అలాగే, ముషీరాబాద్‌లోని వతన్ ఫ్రెష్ మార్ట్, ఉప్పల్‌లోని మెట్రో క్యాష్ అండ్ క్యారీ సంస్థలకు TG SAFE మెరుగుదల నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన 15 సంస్థలకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీల నివేదికలు, సంస్థలు సమర్పించే వివరణలు, ఆహార భద్రతా నిబంధనల అమలును పరిశీలించిన అనంతరం జరిమానాలు సహా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
మొత్తంగా హైదరాబాద్‌లో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే సంస్థలపై ఎలాంటి ఉపేక్ష ఉండదనే సంకేతాలను ఈ దాడులు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా మాంసం, చేపలు, బేకరీ ఉత్పత్తులు కొనుగోలు చేసే వినియోగదారులు ఆహార నాణ్యత, ప్యాకేజింగ్ తేదీలు, పరిశుభ్రతపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..