
హైదరాబాద్ నగరంలో ఈడీ అధికారులమంటూ ఇద్దరు వ్యక్తులు బులియన్ సంస్థ ప్రతినిధులను బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిన ఘటన సంచలనం రేపింది. సనత్‌నగర్‌లోని ఓ బులియన్ కంపెనీని లక్ష్యంగా చేసుకుని ఈ మోసయత్నం జరిగినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్‌లో ఉన్న వింధ్య బులియన్ కంపెనీ’ కార్యాలయానికి ఇటీవల ప్రసాద్ అలియాస్ శశి అనే వ్యక్తి వెళ్లాడు. తాను ఈడీ అధికారి అని పరిచయం చేసుకున్నాడు. ఢిల్లీలో సంస్థపై పలు కేసులు నమోదయ్యాయని, వాటి విచారణ జరుగుతోందని కంపెనీ ప్రతినిధులకు చెప్పాడు. అనంతరం పవన్ అనే మరో వ్యక్తిని కార్యాలయానికి తీసుకొచ్చాడు.
ఈ ఇద్దరూ కలిసి సంస్థ ప్రతినిధులను భయపెట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. కేసులను సెటిల్ చేస్తామని చెప్పి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే మొబైల్ ఫోన్‌లో ఆన్‌లైన్ ఫిర్యాదుల మాదిరిగా కొన్ని పత్రాలు చూపించి అవే అసలు కేసులని నమ్మించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన సంస్థ సిబ్బంది వివరాలు పరిశీలించగా.. చూపించిన ఫిర్యాదులు నకిలీవని గుర్తించారు.
దీంతో వెంటనే సనత్‌నగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. వాళ్లు నకిలీ అధికారులని తెలుసుకొని ఇద్దరి అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరిలించారు. నిందితులు గతంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడ్డారా? ఇతర వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారా? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.