
హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వేదికగా మరోసారి భారీ మొత్తంలో తరలిస్తున్న స్మగ్లింగ్ బంగారం పట్టుబడింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుండి విమానంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు భారతీయ ప్రయాణికులను హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు గురువారం (జూన్ 25) అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 3.36 కోట్ల విలువైన 2.271 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారుల నుంచి అందిన పక్కా నిఘా సమాచారంతో కస్టమ్స్ విభాగం విమానాశ్రయంలో అప్రమత్తమైంది. కౌలాలంపూర్ నుండి వచ్చిన అనుమానిత ప్రయాణికులను అడ్డుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వారు బంగారాన్ని తరలించడానికి ఎంచుకున్న వినూత్న శైలిని చూసి అధికారులు సైతం షాక్‌కు గురయ్యారు.
నిందితులు తాము ధరించిన ప్యాంట్లలో లోపలి వైపు ప్రత్యేకంగా సీక్రెట్ ఫ్యాకెట్లను కుట్టించుకున్నారు. అధికారుల కళ్లు గప్పి తప్పించుకోవచ్చనే ప్లాన్‌తో ఆ ఫ్యాకెట్లల్లో ఈ భారీ మొత్తంలో బంగారాన్ని దాచి తీసుకువచ్చారు. అయితే డిఆర్ఐ సమాచారంతో అధికారులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు, ఈ స్మగ్లింగ్ వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..