
హైదరాబాద్ నగరంలో నిజాయితీ ఇంకా బతికే ఉందని నిరూపించాడు ఓ సాధారణ డెలివరీ బాయ్. పెద్ద చదువులు లేకపోయినా, మనసు పెద్దదైతే చాలు అని తన ప్రవర్తనతో చూపించాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన వలీ అనే యువకుడు జెప్టోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల అతను నాగోల్ పరిసరాల్లో డ్యూటీలో ఉండగా అతని నడి రోడ్డుపై ఓ బ్యాగ్ కనిపించింది. బైక్ ఆపి బ్యాగ్ చేతిలోకి తీసుకున్నాడు. అందులో ఏముందా అని ఓపెన్ చేయగా.. నోట్ట కట్టలు కనిపించాయి.
వేరే వాళ్లు అయితే ఆ డబ్బును చూసి ఆశపడేవారేమో.. కానీ కష్టం విలువ తెలిసిన వాడు కదా.. వలీ మాత్రం అలా చేయలేదు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేరుగా నాగోల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఆ బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించాడు. అయితే పోలీసులు విచారణ చేయగా, ఆ డబ్బు స్థానిక ఫార్మసీకి చెందినది వ్యక్తిదిగా గుర్తించారు. ఫార్మసీ ప్రతినిధి ప్రశాంత్ బ్యాంకులో డిపాజిట్ చేయడానికి రూ.5లక్షలతో వెళ్తుండగా రూ.2 లక్షలు మార్గమధ్యంలో జారిపడినట్లు తెలిసింది.
ఇక డబ్బు పోయిందని ఆందోళన చెందుతున్న ప్రశాంత్‌కు, వలీ నిజాయితీ పెద్ద ఊరటనిచ్చింది. విషయం తెలుసుకున్న నాగోల్ పోలీసులు వలీని ప్రత్యేకంగా అభినందించారు. నాగోల్ సీఐ అతడికి శాలువా కప్పి సన్మానించడమే కాకుండా, రివార్డు కూడా అందజేశారు. అనంతరం పోగొట్టుకున్న నగదును బాధితుడికి తిరిగి అప్పగించారు.
నిజాయితీకి చదువుతో సంబంధం లేదు.. మనసుతో సంబంధం ఉంది అని అక్కడున్నవారు వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో కూడా వాలీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చిన్న ఉద్యోగం చేస్తున్నా, పెద్ద మనసుతో సమాజానికి ఆదర్శంగా నిలిచాడంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.