
అన్నను కడసారి చూసేందుకు వచ్చిన ఓ చెల్లికి అదే చివరి చూపైంది! తోడబుట్టిన అన్న మృతితో కన్నీరుమున్నీరైన ఆ చెల్లెలు.. ఆ విషాదాన్ని తట్టుకోలేకపోయింది. అన్న భౌతికకాయం పక్కనే రోదిస్తూ.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ విలపించింది. అంతలోనే ఒక్కసారిగా కుప్పకూలింది. చూస్తుండగానే ప్రాణాలు విడిచింది. అన్న అంత్యక్రియలు పూర్తికాకముందే.. చెల్లెలి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాల్సిన విషాద పరిస్థితి అక్కడ నెలకొంది. ఒకే ఇంట్లో.. ఒకరి అంతిమయాత్రకు సిద్ధమవుతుండగానే మరో మరణం సంభవించడం.. అందరి కళ్లలో కన్నీళ్లు తెప్పించింది. ఈ విషాద ఘటన యాదాద్రి జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి జిల్లా రాయగిరికి చెందిన కొత్త మల్లయ్య యాదవ్ అనారోగ్యంతో మృతి చెందారు. అన్న మృతిచెందాడన్న వార్త తెలుసుకున్న ఆయన సోదరి.. యాదగిరిగుట్ట మండలం దాతారుపల్లికి చెందిన చుక వెంకమ్మ వెంటనే రాయగిరికి చేరుకున్నారు. అన్న భౌతిక కాయాన్ని చూసిన వెంకమ్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు. చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లముందు మెదిలాయో.. అన్నను కోల్పోయిన బాధ తట్టుకోలేకపోయారో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు తేరుకునేలోపే వెంకమ్మ కూడా ప్రాణాలు విడిచారు.
ఒకే చోట, రెండు విషాదాలు..
అప్పటికే ఇంట్లో అన్న మల్లయ్య మృతదేహం. అంతలోనే కళ్లముందే సోదరి వెంకమ్మ విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. అన్నకు అంతిమ వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్న కుటుంబానికి.. అదే సమయంలో చెల్లెలికి కూడా చివరి వీడ్కోలు పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి నిదర్శనంగా నిలిచిన ఈ విషాద ఘటనతో రాయగిరి, దాతారుపల్లి గ్రామాల్లో విషాద ఛాయలు అలుము కున్నాయి. కడసారి అన్నను చూసేందుకు వచ్చిన చెల్లెలు.. చివరకు అన్నతోనే తన జీవన ప్రయాణాన్ని ముగించిన విషాదం.. ఈ ఘటనతో స్థానికులు సైతం కళ్ల నీళ్లు పెట్టుకతప్పలేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.