
సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ నెలలో మాత్రమే అడ్మిషన్లు జరుగుతుంటాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన అత్యున్నత కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే విద్యా సంవత్సరానికి ముందే అడ్మిషన్లు ఇస్తుంటారు. అలాంటి స్కూల్స్‌లో పిల్లల సీటు కోసం కార్పొరేటర్ నుంచి మంత్రులతో కూడా పైరవి చేస్తుంటారు. ప్రైవేట్ స్కూళ్లను వదిలి నల్లగొండలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు పిల్లల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. సీట్లు పరిమితంగా ఉండటంతో అడ్మిషన్ల కోసం భారీగా రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే స్కూల్ గేటు ముందు తల్లిదండ్రులు, విద్యార్థులు భారీ క్యూ లైన్లలో ఉంటున్నారు.
నల్లగొండ నగరం నడిబొడ్డున శిథిలావస్థలో ఉన్న బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడి జ్ఞాపకార్థం సొంత నిధులతో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ.8కోట్లతో పునర్మిర్మించారు. అత్యాధునికంగా నిర్మించి, ప్రపంచ స్థాయి నాణ్యత గల వాల్డార్ఫ్ విధానంలో బోధన అమలు చేస్తున్నారు. నాలుగంతస్తుల్లో 600 మంది విద్యార్థులకు ప్రపంచస్థాయి నాణ్యత గల విద్య అందించేందుకు 36 ఏసీ తరగతి గదులు ఉన్నాయి. పై అంతస్తులో ఆడిటోరియాన్ని ఏర్పాటు చేశారు.
ఈ పాఠశాలలో పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం నాణ్యంగా ఉండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడ చేర్పించేందుకు పోటీ పడుతున్నారు. నల్గొండ జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా ఉన్న ఈ ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సీట్ కోసం తల్లిదండ్రులు.. సినిమా టికెట్ల కోసం మాదిరిగా ఎగబడుతున్నారు. సీట్లు పరిమితంగా ఉండటం, డిమాండ్ విపరీతంగా పెరగడంతో పాఠశాల యాజమాన్యానికి అడ్మిషన్ల నిర్వహణ పెద్ద సవాలుగా మారింది.
పేద పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగడమే నా లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. ఏ ఒక్క పేద విద్యార్థి చదువుకు దూరం కావొద్దనే లక్ష్యంతో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తున్నాని ఆయన చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచుతూ.. నల్గొండలో విద్యా విప్లవానికి కోమటిరెడ్డి ప్రతీక్ హై స్కూల్ నాంది పలుకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
School
Also Read: మందార మొక్కలో వచ్చే పిండి పురుగు సమస్యకు ఇలా చెక్ పెట్టండి..