Telangana: ఇది కదా విద్యార్థులకు కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..

తెలంగాణ విద్యా రంగంలో పెను మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా కీలక హామీలు ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం, నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే చోట చదువు, ఉచిత టిఫిన్ వంటి విప్లవాత్మక నిర్ణయాలు అమలు కాబోతున్నాయి.

Telangana: ఇది కదా విద్యార్థులకు కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..
Free Bus Travel For Telangana Govt School Students

Updated on: Mar 13, 2026 | 9:38 PM

తెలంగాణలో విద్యా రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి, నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. స్వయంగా విద్యా శాఖను పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా సంచలన నిర్ణయాలు ప్రకటించారు. తాజాగా మాదాపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన సీఎం.. విద్యార్థుల కోసం రవాణా, భోజనం, నూతన విద్యా విధానంపై కీలక హామీలు ఇచ్చారు.

ఉచిత – రాయితీ బస్సు ప్రయాణం

మారుమూల గ్రామాల్లోని విద్యార్థులు కిలోమీటర్ల మేర నడిచి స్కూళ్లకు వెళ్లే ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా లేదా 50 శాతం రాయితీతో బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పించనున్నారు. దీనివల్ల నిరుపేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుంది.

సమగ్ర విద్యా విధానం

వచ్చే విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే చోట విద్యను అందించే విధానాన్ని అమలు చేయనున్నారు. విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండి కాలేజీ స్థాయి వరకు వేర్వేరు చోట్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఒకే ప్రాంగణంలో చదువుకునేలా ఈ విధానాన్ని రూపొందించారు.

ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన విద్య అందుతుంది.

ఉచిత టిఫిన్ – భోజనం

ఈ పబ్లిక్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పూట పౌష్టికాహారంతో కూడిన టిఫిన్ కూడా ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఈ కొత్త విద్యా విధానం వల్ల డ్రాపౌట్స్ సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా రవాణా సౌకర్యం కల్పించడం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు ఉన్నత విద్య మరింత సులభతరం అవుతుంది. విద్యా శాఖ సీఎం వద్దే ఉండటంతో నిర్ణయాల అమలులో వేగం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Follow Us