
వాట్సాప్‌లో వచ్చిన ఓ నకిలీ వాటర్ బిల్లు మెసేజ్‌ను నమ్మిన రిటైర్డ్ ఉద్యోగి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుని రూ.4.19 లక్షలు కోల్పోయాడు. ఓటీపీ చెప్పకపోయినా, యాప్‌ల రూపంలో మాల్వేర్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి బ్యాంకు ఖాతాలోని నగదును కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎల్‌బీనగర్ సమీపంలోని రాక్‌టౌన్ కాలనీలో నివసించే ఓ రిటైర్డ్ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగికి జూలై 1న వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. అందులో “హైదరాబాద్ వాటర్ బోర్డు తాగునీటి బిల్లు చెల్లించలేదు.. వెంటనే చెల్లించకపోతే నీటి కనెక్షన్ నిలిపివేస్తాం” అని పేర్కొంటూ, సహాయం కోసం ఒక ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఆందోళన చెందిన బాధితుడు ఆ నంబర్‌కు కాల్ చేయగా, అవతలి వ్యక్తి తనను వివేక్ శర్మగా పరిచయం చేసుకుని వాటర్ మీటర్ కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉందని చెప్పాడు. ఆ ప్రక్రియ పేరుతో బాధితుడి యూపీఐ వివరాలు, ఎస్‌బీఐ బ్యాంకు ఖాతా సమాచారం, ఏటీఎం కార్డు వివరాలు తీసుకున్నాడు.
కొంతసేపటికి అనుమానం వచ్చిన బాధితుడు కాల్‌ను నిలిపివేశాడు. అయితే అప్పటికే వాటర్ బోర్డు అధికారిక యాప్‌ల మాదిరిగా కనిపించే రెండు నకిలీ మొబైల్ యాప్‌లు అతని ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యాయి. బాధితుడు ఎలాంటి ఓటీపీ, పిన్ లేదా పాస్‌వర్డ్ చెప్పకపోయినా, ఆ యాప్‌ల సహాయంతో సైబర్ నేరగాళ్లు అతని బ్యాంకు ఖాతా నుంచి మొత్తం రూ.4.19 లక్షలు అక్రమంగా బదిలీ చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.