తెలంగాణ తొలి శాసన సభ డిప్యూటీ స్పీకర్, ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఊహించని సంఘటన ఎదురైంది. గవర్నర్ నరసింహన్‌కు ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభ కోసం.. పద్మాదేవేందర్ రెడ్డి అక్కడకు వెళ్లారు. అయితే ఎమ్మెల్యేలకు అనుమతి లేదంటూ ఆమెను పోలీసులు లోపలికి అనుమతించలేదు. కేవలం మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు మాత్రమే అనుమతి ఉందని… ఎమ్మెల్యేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అధికారులు చెప్పింది విని పద్మా దేవేందర్ రెడ్డి షాక్ కు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఓ మంత్రి కుమారుడు మాత్రం సభకు వెళ్లేందుకు అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ హోదా కలిగిన తనకు అనుమతి ఇవ్వకపోవడంతో పద్మాదేవేందర్ రెడ్డి విస్మయానికి గురైనట్లు తెలుస్తోంది.