Telangana: ఓటర్లకు బిగ్ రిలీఫ్.. జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం!

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ గడువు పొడిగించే అవకాశం ఉంది. భారత ఎన్నికల సంఘం (ECI) కనీసం మూడు వారాల పాటు గడువును పొడిగించేందుకు సిద్ధంగా ఉంది. ఓటర్లకు మరింత సమయం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను ECI పరిశీలిస్తోంది. దీంతో తుది ఓటర్ల జాబితా ప్రచురణ నవంబర్ చివరి వారానికి వాయిదా పడే అవకాశం ఉంది, ఇది ఓటర్లకు పెద్ద ఉపశమనం.

Telangana: ఓటర్లకు బిగ్ రిలీఫ్..  జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం!
Telangana Voter List Sir

Updated on: Sep 04, 2026 | 9:08 AM

 

ఓటర్ల జాబితాపై EC కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్..!

హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితాల SIR ప్రక్రియకు గడువు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత షెడ్యూల్‌ను కనీసం మూడు వారాల పాటు పొడిగించేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) సిద్ధమవుతున్నట్లు తెలంగాణ ముఖ్య ఎన్నికల కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

ECకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

SIR ప్రక్రియకు అదనపు సమయం ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ECIకి లేఖ రాసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి.. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌కు లేఖ రాస్తూ, ఓటర్ల నుంచి వాదనలు, అభ్యంతరాలు స్వీకరించేందుకు ప్రస్తుతంగా ఉన్న గడువు సరిపోదని పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు తమ వాదనలు వినిపించేందుకు, అవసరమైన పత్రాలను సమర్పించేందుకు మరింత సమయం అవసరమని ప్రభుత్వం పేర్కొన్నారు. ప్రభుత్వం మరో నాలుగు వారాల పాటు గడువు పొడిగించాలని కోరినప్పటికీ.. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కనీసం మూడు వారాల పొడిగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత షెడ్యూల్ ఏంటి?

ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు, అభ్యంతరాలను సెప్టెంబర్ 16 వరకు స్వీకరిస్తారు. అనంతరం నోటీసుల జారీ, విచారణ, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 15 వరకు కొనసాగుతుంది. చివరగా అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా ప్రచురించాల్సి ఉంది. అయితే గడువు పొడిగిస్తే ఈ తేదీలన్నీ మారే అవకాశం ఉంది. తాజా ప్రతిపాదన ప్రకారం తుది ఓటర్ల జాబితా నవంబర్ చివరి వారంలో వెలువడే అవకాశం ఉందని ఎన్నికల వర్గాలు చెబుతున్నాయి.

విచారణలను వేగవంతం చేయాలని ఆదేశాలు

మరోవైపు SIRలో భాగంగా జారీ చేసిన నోటీసులపై విచారణ, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) సి. సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కీసర మండలం నర్సంపల్లి, మేడ్చల్ మండలం మునీరాబాద్‌, దుండిగల్‌ మండలం దొమ్మర పోచంపల్లిలో నిర్వహించిన విచారణలను ఆయన పరిశీలించారు. అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్‌రెడ్డి, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఎం. మను చౌదరితో కలిసి ఈ ప్రక్రియను సమీక్షించారు.

రికార్డుల ధ్రువీకరణపై ఫోకస్

మ్యాపింగ్‌ కాని ఓటర్లు, ఓటరు కార్డుల్లో వ్యత్యాసాలు లేదా అసాధారణతలు ఉన్నట్లు గుర్తించిన కేసుల్లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరైన తర్వాత, వారు సమర్పించే సహాయక పత్రాలను నిబంధనల ప్రకారం ధ్రువీకరించిన అనంతరం మాత్రమే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. SIR గడువు పొడిగింపుపై ECI అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాతే తుది తేదీలపై స్పష్టత రానుంది. ఒకవేళ పొడిగింపు అమల్లోకి వస్తే తెలంగాణలో తుది ఓటర్ల జాబితా అక్టోబర్‌ నుంచి నవంబర్‌ చివరి వారానికి మారే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us